
శతాధిక వృద్ధుల సత్కారానికి దరఖాస్తుల ఆహ్వానం
మధురానగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన శతాధిక వృద్ధులను సత్కరించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్ తెలిపారు. దుర్గాపురంలోని విజయ్ నర్సింగ్ కళాశాలలో మంగళవారం శతాధిక వృద్ధులకు సత్కారం కర పత్రాల ఆవిష్కరణ జరిగింది. హరికుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నూరు సంవత్సరాలు పూర్తిచేసుకున్న వృద్ధులను గుర్తించి, ఒకే వేదికపై ప్రముఖుల చేతుల మీదుగా సత్కరిస్తామని తెలిపారు. శతాధిక వృద్ధులు వచ్చే నెల 10వ తేదీలోపు వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో స్వయంగా లేదా 98481 11138, 93475 72766 ఫోన్ నంబర్లలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ట్రస్టీలు తట్టి అర్జునరావు, అమరా ఉమా మహేశ్వరరావు, కె.మధుసూదనరావు, పి.లక్ష్మీ నరసింహారావు, వెంకటేష్ గోదావరి తదితరులు పాల్గొన్నారు.
గూడూరు: మండల పరిధిలోని కంకటావ గ్రామంలో వీరంకి విఘ్నేశ్వరరావు(38) హత్య కేసులో నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. విఘ్నేశ్వరరావును హత్యచేసి, మృతదేహాన్ని సంచిలో మూటగట్టి పడేసిన విషయం విదితమే. ఈ నెల 22న ఈ ఘటన వెలుగుచూసింది. గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విఘ్నేశ్వరరావు తండ్రి నిరంజన్‌రావును నిందితుడిగా గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. నిందితు డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణామిల్క్ యూనియన్ పాలకవర్గానికి సంబంధించి వివిధ సమితులకు నిర్వహించిన ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెడన మండలం పెనుమల్లికి చెందిన అర్జా వెంకటనగేష్, వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన ఇంజం రామారావు, విస్సన్నపేట మండలం విస్సన్నపేటకు చెందిన నెక్కళపు వాణిశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి లంక గురునాథం ప్రకటించారు.
మట్టి విగ్రహాల పంపిణీ
వినాయక చవితి పండుగన పురస్కరించుకొని కృష్ణా మిల్క్ ప్రాజెక్ట్ ప్రాంగణంలో సిబ్బందికి ఆ సంస్థ చైర్మన్ చలసాని ఆంజనేయులు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పండగను శాంతి భద్రతలకు ఆటంకం లేకుండా ప్రజలందరూ జరుపుకోవాలని సూచించారు.