
నూతన బార్ పాలసీకి స్పందన కరువు
39 జనరల్ బార్‌లకు 58 దరఖాస్తులు గీతకార్మికులకు కేటాయించిన బార్‌లకు మూడు దరఖాస్తులు
చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన బార్ పాలసీకి దరఖాస్తుదారుల నుంచి స్పందన కనపడటం లేదు. కొత్త పాలసీలో ఇచ్చిన నిబంధనలతో తాము వ్యాపారం చేయలేమని దరఖాస్తుదారులు వెనకడుగు వేస్తున్నారు. ఒక్కొక్క బార్‌కు ఒక్క దరఖాస్తుదారుడు నాలుగు అప్లికేషన్లు వేయాలని నిబంధన పెట్టడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రిటైల్ మద్యం షాపులు ఆయా ప్రాంతా ల్లో కేటాయించటంతో అక్కడ తక్కువ ధరకు మద్యం అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో నూతన బార్ పాలసీలో విధించిన నిబంధన ప్రకారం తమకేమీ ఉపయోగం ఉండదనే ఉద్దేశంతో దరఖాస్తుదారులు వెనకడుగు వేస్తున్నారు. ఒక దరఖాస్తుదారుడు నాలుగు దరఖాస్తులు వేయాలనే నిబంధన, ప్రభుత్వం అమలు చేస్తున్న ట్యాక్స్‌ను రద్దు చేయాలని వారు కోరుతున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం వీటిపై ఏమైనా చర్యలు తీసుకుంటేనే జిల్లాలోని బార్‌లకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని వ్యాపారస్తులు వాపోతున్నారు.
మరో మూడు రోజులు పొడిగింపు..
దరఖాస్తులు ఎక్కువగా రాకపోవటంతో మంగళ వారంతో దరఖాస్తు చేసుకునే అవకాశం ముగిసి నందున, రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు రోజుల పాటు పొడిగించింది. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని మంగళవారం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. ఈ షాపులకు ఆగస్టు 30వ తేదీన కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో వచ్చిన దరఖాస్తులను బట్టి డ్రా తీయనున్నారు. అయితే ప్రభుత్వం తాము కోరుకుంటున్నట్లు పాలసీలో మార్పులు చేస్తేనే బార్‌లు ద్వారా వ్యాపారాలు చేయగలమని వ్యాపారస్తులు బాహాటంగా చెబుతున్నారు.
నాలుగు దరఖాస్తులు ఉంటేనే..
కృష్ణా జిల్లాలో జనరల్ బార్‌లు 39, గీత కార్మికులకు కేటాయించినవి నాలుగు షాపులు ఉన్నాయి. వీటికి మంగళవారం వరకు 61 దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రతి బార్‌కు నాలుగు దరఖాస్తులు చేస్తేనే డ్రా చేసేందుకు అర్హత ఉంటుంది. దీంతో దరఖాస్తుదారులు అంతగా ఆసక్తి చూపలేదు. ఎకై ్సజ్ అధికారులు దిక్కుతోచని పరిస్థితిలో మరికొద్ది రోజులు పొడిగించారు.
దరఖాస్తుల వివరాలు..
ప్రస్తుతం మచిలీపట్నం నగరంలోని గెజిట్ నంబరు –4, 6, గుడివాడ మునిసిపాలిటీ పరిధిలోని గెజిట్ నంబరు–15, వైఎస్సార్ తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో గెజిట్ పరిధి నంబరు–23, 27, 30, 34, 35 షాపులకు ఒక్క దరఖాస్తుదారుడే నాలుగు అప్లికేషన్లు వేసినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి. గంగాధరరావు ‘సాక్షి’కి తెలిపారు. గీత కార్మికులకు కేటాయించిన నాలుగు షాపులకు కేవలం మూడు దరఖాస్తులే వచ్చాయి. అయితే ఈ షాపులకు ఈ నెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే గడువు ఉన్నందున వాటికి ఏ విధంగా స్పందన ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.