అగమ్యగోచరంగా ఐసీఆర్పీలు
చల్లపల్లి: ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేందుకు ఎవరికి వారు అప్పులు సమకూర్చుకోవాలని అధికారులు చిన్నపాటి ఉద్యోగులపై ఒత్తిళ్లు తెస్తుండటంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ(ఏపీసీఎన్‌ఎఫ్) విభాగంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఐసీఆర్పీల పరిస్థితి ఇది. పేరుకుపోయిన బకాయి వేతనాలు అందక అప్పుల్లో కూరుకుపోయిన తాము ఉన్నతాధికారులు నిర్ధేశించిన లక్ష్యాన్ని అధిగమించటానికి అప్పులు ఎక్కడ నుంచి తేవాలో తెలియక కకావికలమవుతున్నారు.
జిల్లా స్థాయిలో సిబ్బంది నియామకం..
ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ(ఏపీఆర్‌వైఎస్‌ఎస్) ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం(ఏపీసీఎన్‌ఎఫ్)ను ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాల్లో ప్రాజెక్టు మేనేజరుతో పాటు క్షేత్రస్థాయి వరకూ సిబ్బందిని నియమించారు. కృష్ణా జిల్లాలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌తో పాటు ప్రతి డివిజన్(మూడు మండలాలు)కు ఒక మాస్టర్ ట్రైనర్(ఎంటీ) చొప్పున ఎనిమిది మంది, మండల స్థాయిలో మండల యాంకర్స్(ఎంఏ), ప్రాజెక్ట్ రిసోర్స్ పర్సన్(పీఆర్పీ)లు, మండల కమ్యూనిటీ రిసోర్స్‌పర్సన్స్(ఎంసీఆర్పీ)లు మొత్తం 13 మంది, మూడు నుంచి నాలుగు గ్రామాలకు కలిపి ఒక యూనిట్ ఇన్‌చార్జి చొప్పున 25 మంది, వీరి పర్యవేక్షణలో ప్రతి గ్రామైక్య సంఘానికి ఒక ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్(ఐసీఆర్పీ) చొప్పున సుమారు 250 మంది విధులు నిర్వర్తిస్తున్నారు.
కిట్టు ఖరీదు రూ.1,350
రబీ సీజన్ ప్రారంభానికి ముందు రైతుల చేత 32 రకాలతో కూడిన ప్రీమూన్ డ్రై సోయింగ్(పీఎండీఎస్) నవధాన్యాలతో పచ్చిరొట్ట సాగుచేసేలా ఐసీఆర్పీలు పనిచేయాలని అధికారుల నంచి ఆదేశాలొచ్చాయి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులతో పాటు రసాయనిక ఎరువులతో సేద్యం చేసే ప్రతి రైతు చేత ఒక్క ఎకరాలోనైనా ఈ సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్క ఎకరాకు పచ్చిరొట్టగా 13.5(ఒక కిట్టు) కిలోల నవధాన్యాలు అవసరమవుతాయి. ఒక్కొక్క కిట్టు తయారీకి సగటున రూ.1,350లు ఖర్చు అవుతుంది. నవధాన్యాలను సేకరించి సంచుల్లో నింపటం, కిట్లుగా కట్టడం, రైతులకు అందజేయటం వంటివన్నీ ఐసీఆర్పీలు చూడాలి. దీనికి అవసరమైన నిధులను సెల్ఫ్ హెల్ప్ గ్రూపు(ఎస్‌హెచ్‌జీ)లకు బ్యాంకుల నుంచి రుణం ఇప్పించి ఆ రుణంతో ఐసీఆర్పీల చేత కిట్లు తయారు చేయించి వాటిని రైతులకు అమ్మి, వచ్చిన డబ్బును డ్వాక్రా గ్రూపులకు కట్టుకోవాలని అధికారులు మార్గం చూపించారు. దాదాపు అన్ని ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు ఇప్పటికే లోన్లు ఉండటంతో కొత్త లోను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావటంలేదు. ఐసీఆర్పీలే సొంత డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
భారీగా పేరుకుపోయిన వేతన బకాయిలు
ఒక్కొక్క ఐసీఆర్పీకి పనిచేసే ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.7,500 నుంచి రూ.14 వేల వరకూ వేతనాలు ఇస్తారు. బకాయిపడిన 24 నెలల వేతనాల్లో గత మార్చిలో 12 నెలల వేతనాలు మాత్రమే విడుదల చేశారు. ఇంకా 12 నెలల వేతన బకాయిలు అలాగే ఉన్నాయి. ఒక్కొక్క ఐసీఆర్పీ పరిధిలో సుమారు 50 నుంచి 70 మంది వరకూ రైతులు ఉండగా వారికి ఒక్కొక్క కిట్టు అందించాలంటే ఒక్కొక్క ఐసీఆర్పీ రూ.65 వేల నుంచి రూ.98 వేల వరకు పెట్టుబడి పెట్టాలి. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి పీఎండీఎస్ కిట్లు ఎలా ఏర్పాటుచేయాలో అర్థం కాక తలమునకలవుతున్నారు. కిట్లు టార్గెట్లు పూర్తిచేయకపోతే విధుల నుంచి తొలగిస్తామని అధికారులు చెప్పటం ఆందోళన కలిగిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.1,350 ఖర్చు పెట్టి పచ్చిరొట్ట వేసేందుకు రైతులు ముందుకు రావటంలేదు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రయోజనం లేదు. నవధాన్యాల కిట్లను వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై అందిస్తే కొంతమేర లక్ష్యాన్ని చేరుకునే వీలుంటుందని కిందిస్థాయి ఉద్యోగులు, ఐసీఆర్పీలు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు, వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్న తమకు ఈ కిట్ల టార్గెట్ల నుంచి విముక్తి కలిగించాలని, పెండింగ్‌లో ఉన్న తమ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.
అందని జీతాలు.. నవధాన్యాల కిట్ల లక్ష్యాలతో ఆందోళన
అప్పుల్లో కూరుకుపోతున్న దుస్థితి
అధికారుల వింత పోకడలతో బెంబేలు
కిట్ల కొనుగోలుకు ఆసక్తి చూపని రైతులు
ఎస్‌హెచ్‌జీ గ్రూపుల ద్వారా రుణాలు..
పీఎండీఎస్ కిట్ల తయారీకి అవసరమైన నిధులను సమకూర్చేందుకు ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు లోన్లు ఏర్పాటుచేస్తున్నాం. ఇప్పటికే వారికి లోన్లు ఉంటే అదనంగా మరలా లోన్లు ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నాం.
–పార్థసారథి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, ఏపీసీఎన్‌ఎఫ్


