దేశభక్తికి ప్రతీక ఎన్‌సీసీ
కోనేరుసెంటర్: విలువలతో కూడిన క్రమశిక్షణకు, దేశభక్తికి ఎన్‌సీసీ ప్రతీక అని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు అన్నారు. స్థానిక చిలకలపూడి నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో సోమవారం ఎన్‌సీసీ క్యాడెట్లకు క్యాంప్ కిట్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను కూడా విద్యార్థి దశలో ఎన్‌సీసీ క్యాడెట్‌గా చేశానని చెబుతూ అప్పటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఎన్‌సీసీ ద్వారా కలిగే ప్రయోజనాలు వివరించి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. ఎన్‌సీసీ శిక్షణలో తీసుకున్న రైఫిల్ ట్రైనింగ్ ఉద్యోగం వచ్చాక పోలీసు శిక్షణలో ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. జిల్లా విద్యా శాఖాధికారి రామారావు మాట్లాడుతూ ఎన్‌సీసీ ద్వారా చక్కని శారీరక దారుఢ్యంతో పాటు ఆత్మస్థైర్యం, సమయస్ఫూర్తి అలవడతాయన్నారు. అనంతరం ఎన్‌సీసీ విద్యార్థులకు క్యాంప్ కిట్లు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ సలహాదారుడు డీవీఆర్, పాఠశాల ఎన్‌సీసీ ఆఫీసర్ అప్పినేడి వెంకట రామాంజనేయులు(రాము), ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎస్పీ ఆర్.గంగాధరరావు


