మచిలీపట్నంటౌన్: మచిలీపట్నం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నూతనంగా నిర్మించిన వైద్య ఆరోగ్య డిస్పెన్సరీ భవన ప్రారంభోత్సవం గురువారం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రవాణా శాఖా మంత్రిగా పని చేసిన మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) ప్రత్యేక కృషితో ఈ డిస్పెన్సరీ నిర్మాణం ప్రారంభమైంది. ప్రస్తుతం డిస్పెన్సరీ నిర్వహిస్తున్న గృహం శిథిలావస్థకు చేరటంతో వైద్య సేవలందించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా పేర్ని నాని దాదాపు రూ.80 లక్షల నిధులు మంజూరు చేయించి ఈ నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భవన నిర్మాణం ఎప్పుడో పూర్తయినా కూటమి నాయకులు ఎట్టకేలకు గురువారం దీనిని ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఈ డిస్పెన్సరీలో జిల్లాలోని ఐదు ఆర్టీసీ డిపోల్లో పని చేస్తున్న దాదాపు 1400 మంది ఉద్యోగులు, సిబ్బంది వైద్య సేవలు పొందనున్నారు. ప్రతి రోజూ సరాసరిన 80 మంది వైద్య సేవలు పొందుతున్నారు. పేర్ని నాని రవాణా శాఖా మంత్రిగా ఉన్న సమయంలోనే బస్టాండ్ అభివృద్ధికి దాదాపు రూ.3.40 కోట్లను కేటాయింప చేసి పనులను పూర్తి చేశారు. చిన్న పాటి వర్షానికే చెరువును తలపించే బస్టాండ్ ఆవరణలో కాంక్రీట్ మెరక పనులు చేశారు. అధునాతన టాయిలెట్లు, బస్టాండ్ ఎలివేషన్, బస్టాండ్ భవన విస్తరణ తదితర పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం బస్టాండ్ అభివృద్ధి అంతా నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కృషికి నిదర్శనంగా నిలుస్తోంది. గురువారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ డిస్పెన్సరీ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖా మంత్రి ఎం.రామ్‌ప్రసాద్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ కార్యదర్శి కాంతీలాల్‌దండే, ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హాజరవుతారని జిల్లా ప్రజా రవాణాధికారి ఎ.వాణిశ్రీ బుధవారం తెలిపారు.


