వాహనాలు ఢీకొని మృత్యువాత పడుతున్న పశువులు ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు అవగాహన లేక బీమాకు దూరం తీవ్రంగా నష్టపోతున్న యజమానులు
రెబ్బెన: వాహన చక్రాల కింద మూగజీవాలు నలిగిపోతున్నాయి. మితిమీరిన వేగంతో ప్రయాణించే లారీలు, టిప్పర్లు, ఇతర వాహనాలు పశువుల పాలిట మృత్యు శకటాలుగా మారుతున్నాయి. రోడ్డు దాటే క్రమంలో ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు సైతం వాహనాలు ఢీకొన్ని మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు బీమాపై యజమానులకు అవగాహన లేకపోవడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రమాదాలకు కారణమైన వాహనదారులు మాత్రం అరకొరగా పరిహారం అందించి చేతులు దులుపుకొంటున్నారు.
ఆసిఫాబాద్, రెబ్బెనలో అధికం..
వాహనాలను త్వరగా గమ్య స్థానాలకు చేర్చాలనే ఆత్రంతో డ్రైవర్లు మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. ఈ నెలలోనే ఆసిఫాబాద్, రెబ్బెన మండలాల్లో వాహనాలు ఢీకొని ఆవులు, గొర్రెలు మృతి చెందిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సింగరేణి బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీ నుంచి బొగ్గు లోడుతో గోలేటి సీహెచ్‌పీ వెళ్లే కోల్ ట్రాన్స్‌పోర్ట్ లారీలు అడ్డూఅదుపు ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రద్దీ ఉండే ప్రాంతాల్లో వేగాన్ని నియత్రించేందుకు రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఓవర్‌లోడ్‌తో నడిచే లారీలకు స్పీడ్ బ్రేకర్లు ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ఫలితంగా ఖైరిగూర ఓసీపీ టు గోలేటి సీహెచ్‌పీ దారిలో తరుచూ పశువులను లారీలు ఢీకొడుతూనే ఉన్నాయి. ఈ తరహాలోనే రెబ్బెన మండలం సోనాపూర్ వద్ద ఈ ఏడాది రెండుసార్లు ఆవుల మందపైకి బొగ్గు టిప్పర్లు దూసుకెళ్లాయి. అయినా అధికారులు టిప్పర్ల అతివేగానికి కళ్లెం వేయలేకపోయారు. దీపావళి రోజున సోనాపూర్ వద్ద బొగ్గు టిప్పర్ కిందపడి 10 ఆవులు మృతి చెందాయి. యజమానులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో పరిహారం చెల్లించేందుకు కోల్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థ హామీ ఇచ్చింది.
బీమా లేక నష్టాలపాలు
చాలావరకు పశువులను ఢీకొట్టిన వాహనాలను ఆపకుండానే డ్రైవర్లు వెళ్లిపోతున్నారు. బాధితులు వాహనాలు ఆపి ఆందోళనలు చేపడితే అరకొర పరి హారం అందిస్తున్నారు. అయితే పశువుల బీమాపై పాడి రైతులకు అవగాహన లేక నష్టాలపాలవుతున్నారు. బీమా ఉంటే ప్రమాదవశాత్తు పశువులు మృత్యువాత పడితే ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందు కు సదరు కంపెనీలు పరిహారం చెల్లిస్తాయి. ప్రస్తుతానికి ప్రభుత్వం తరుఫున బీమా సౌకర్యం లేకపోవడంతో యజమానులు పూర్తిగా ప్రైవేటు సంస్థలపైనే ఆధారపడుతున్నారు. పాడి ఆవులు, గేదెలతోపాటు గొర్రెలు, మేకలు, ఎద్దులకు సైతం బీమా చేయించుకోవచ్చు. పశువుల మార్కెట్ విలువపై ఐదు శాతం ప్రీమియం చెల్లిస్తే ఏడాదిపాటు బీమా వర్తిస్తుంది. ప్రమాదవశాత్తు, ఇతర ఆరోగ్య సమస్యలతో మృతి చెందితే పరిహారం చెల్లిస్తాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడితే ఆరోగ్య పరిస్థితిని బట్టి సైతం పరిహారం అందిస్తారు.
బీమాతో మేలు
పాలిచ్చే పశువులతోపాటు ఇతర పశువులకు బీమా చేయిస్తే రైతులకు ఎంతో మేలు. అనుకోని ప్రమాదం జరిగి పశువులు మృత్యువాత పడితే పరిహారం పొందవచ్చు. పశువుల మార్కెట్ విలువపై 5 శాతం బీమా ప్రీమియంగా చెల్లిస్తే ఏడాదిపాటు వరిస్తుంది. ఈ సమయంలో పశువులకు ఏమైనా జరిగి చనిపోతే కంపెనీ ద్వారా పరిహారం అందుతుంది. యజమానికి ఎలాంటి నష్టం ఉండదు.
– కార్తీక్,
పశువైద్యాధికారి, రెబ్బెన
వరుస ఘటనలు
జిల్లాలో రోడ్డు దాటే క్రమంలో గొర్రెలు, పశువుల మందలపైకి వాహనాలు దూసుకెళ్తున్న ఘటనలు వరుసగా చోటుచేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఏప్రిల్‌లో రెబ్బెన మండలంలోని కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ సమీపంలో గొర్రెల మందపైకి బొలెరో దూసుకెళ్లడంతో 25 గొర్రెలు మృతి చెందగా 15 వరకు తీవ్రంగా గాయపడ్డాయి. ఆగస్టులో రెబ్బెన మండలం సోనాపూర్ వద్ద బొగ్గు టిప్పర్ ఢీకొని ఒక ఆవు మృతి చెందగా మరో మూడు తీవ్రంగా, ఆరు స్వల్పంగా గాయపడ్డాయి. అక్టోబర్‌లో రెబ్బెన మండలంలోని తక్కళ్లపల్లి బస్టాప్ వద్ద జాతీయ రహదారి దాటుతున్న క్రమంలో గొర్రెల మందను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది గొర్రెలు మృతి చెందగా మరో 17 తీవ్రంగా గాయపడ్డాయి. ఈ నెల 2న ఆసిఫాబాద్ మండలం సామెల వద్ద కారు ఢీకొని 20 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ నెల 8న రెబ్బెన మండలం సోనాపూర్ వద్ద రోడ్డుపై వెళ్తున్న పశువుల మందపైకి బొగ్గు టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 ఆవులు మృతి చెందాయి.


