జిల్లాలో ప్రభుత్వ కొనుగోళ్లు నిల్ వ్యాపారులకే వరిధాన్యం అమ్ముకుంటున్న రైతులు కోతలు కాగానే పొలాల వద్దే కాంటాలు
దహెగాం: జిల్లాలో ఓ వైపు జోరుగా వరికోతలు సాగుతున్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు మాత్రం క్వింటాల్ ధాన్యం కూడా రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతోపాటు బోనస్ చెల్లిస్తామని ప్రకటించినా అన్నదాతలు అటువైపు మొగ్గు చూపడం లేదు. ఆశించిన ధర వస్తుండటంతో చాలామంది రైతులు ప్రైవేట్ వ్యాపారులకే ధాన్యం మొత్తం విక్రయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్‌లో 35,452 ఎకరా ల్లో వరి సాగైనట్లు వ్యవసాయాధికారులు వెల్లడించారు. గతేడాది 55 వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉండగా, ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులతో వరి సాగు విస్తీర్ణం 20 వేల ఎకరాలకు పడిపోయింది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, వాంకిడి, సిర్పూర్ నియోజకవర్గంలోని సిర్పూర్(టి), కాగజ్‌నగర్, పెంచికల్‌పేట్, చింతలమానెపల్లి, దహెగాం, కౌ టాల, బెజ్జూర్ మండలాల్లో వరి పొలాలు ఉన్నా యి. సాగు నీరు అందుబాటులో లేకపోవడం, అధికారులు అవగాహన కల్పించడంతో చాలా మంది పత్తి సాగు వైపు మళ్లారు. బోర్ల సౌకర్యం ఉన్నవారు మాత్రం నాట్లు వేశారు.
కోత కాగానే కొనుగోలు..
బియ్యం ధరలు అమాంతంగా పెరగడంతో ధా న్యానికి సైతం డిమాండ్ పెరిగింది. రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు మొగ్గు చూపడం లేదు. పంట హార్వెస్టింగ్ పూర్తికాగానే పచ్చి వడ్లనే వ్యాపారులు కోనుగోలు చేస్తున్నారు. సన్నరకం పచ్చి వడ్లకు రూ.2600 నుంచి రూ.3000 వరకు చెల్లిస్తున్నారు. నాణ్యమైన జైశ్రీరాం ధాన్యం అయితే క్వింటాల్‌కు రూ.3,300 వరకు చెల్లించి కొంటున్నారు. అదే కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర రూ.2,469 ఉండగా, బోనస్‌తో కలిపి రూ.2,900 వరకు గరిష్ట ధర దక్కుతుంది. ప్రస్తుతం పచ్చి వడ్లనే కొనుగోలు చేస్తుండటంతో బరువు కలిసి వస్తుందని రైతులు చెబుతున్నారు. క్వింటాల్‌కు అదనంగా రూ.400 అదనంగా దక్కుతుంది. దీంతో ఈ ఏడాది జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి ధాన్యం రావడం అనుమానంగానే ఉంది. జిల్లా వ్యాప్తంగా 23 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం పెట్టుకున్నారు. కానీ ఐదు వేల మెట్రిక్ టన్నులు కూడా దాటే అవకాశం లేదని స్వయంగా ఆ శాఖ అధికారులే స్పష్టం చేస్తున్నారు.
17 కొనుగోలు కేంద్రాలు
జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 17 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల ఆన్‌లైన్, జియో ట్యాగింగ్ వంటి టెక్నికల్ పనులు పూర్తి చేస్తున్నారు. యాసంగిలో 37 కొనుగోలు కేంద్రాలు ఉండగా ఇప్పుడు 17 కేంద్రాలకే పరిమితం చేశారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు పలు రకాల నిబంధనలు విధిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ధాన్యం ఆరబెట్టడం, తూర్పారా పట్టి తప్పతాలు లేకుండా తీసుకురావాలని సూచిస్తున్నారు. గతంలో కాంటా సైతం ఆలస్యం కావడంతో ధాన్యం రాశుల వద్ద రైతులు రోజుల తరబడి నిరీక్షించిన ఘటనలు అనేకం ఉన్నాయి.
కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నాం
జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు 17 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఆన్‌లైన్ చేయడం, టెక్నికల్ పనులు చేపడుతున్నాం. రైతులు ధాన్యం తీసుకొస్తే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 23 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం నిర్దేశించుకున్నాం.
– రజిత, డీఎం, పౌరసరఫరాల శాఖ


