రెబ్బెన: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి అన్నారు. ఏఐటీయూసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయం ఎదుట చేపట్టిన రెండు రోజుల రిలే నిరాహార దీక్షలు గురువారం ముగిశాయి. ఆయన మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తికి అవసరమైన యంత్రాలు, పరికరాలు కొనుగోలు చేయలేని పరిస్థితికి సింగరేణిని తీసుకువచ్చారని ఆరోపించారు. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు బకాయి ఉన్న రూ.60వేల కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డిస్మిస్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ చేసుకున్న 24 ఒప్పందాలను తక్షణమే అమలు చేయాలన్నారు. దీక్షలో ఆర్గనైజింగ్ కార్యదర్శి జగ్గయ్య, శేషశయన రావు, ఆనంద్, సమీ, పిట్ కార్యదర్శులు రామయ్య, అశోక్, రమేశ్, బేస్ వర్క్‌షాప్ ఇన్చార్జి షకీల్, నాయకులు రాజు, వసీం, రాజయ్య, తిరుపతి, శ్రీనివాస్, సారయ్య, అశీష్, రాయలింగు తదితరులు పాల్గొన్నారు.


