చదవాలి.. రాయాలి..! | - | Sakshi
Sakshi News home page

చదవాలి.. రాయాలి..!

Nov 13 2026 12:22 AM | Updated on Nov 13 2026 12:22 AM

కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో ‘మిషన్‌ వందశాతం లర్నింగ్‌’ షురూ ప్రాథమిక స్థాయి విద్యార్థులపై విద్యాశాఖ ఫోకస్‌ ఈ నెల 21 వరకు కొనసాగింపు

కెరమెరి: ప్రాథమిక పాఠశాలల్లోని 2 నుంచి 5వ తరగతి చదువుతున్న చిన్నారుల విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు జిల్లా యంత్రాంగం వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు బలమైన పునాదులు వేయాలన్న ఉద్దేశంతో కలెక్టర్‌ కె.హరిత ప్రత్యేక చొరవతో సోమవారం నుంచి ‘మిషన్‌ వందశాతం లర్నింగ్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను వందశాతం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కేవలం అక్షర జ్ఞానమే కాకుండా విద్యార్థులు చదవడం, రాయడంతోపాటు గణితంలో చతుర్విద ప్రక్రియలపై సంపూర్ణ పట్టు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 11న ప్రారంభమైన ఈ కార్యక్రమం 21వ తేదీ వరకు పది రోజుల పాటు కొనసాగనుంది. ప్రత్యేక కార్యాచరణతో చదువులో వెనుకబడిన ప్రతీ విద్యార్థిని మెరుగుదిద్దేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.

45శాతం మంది వెనుకబాటే..

జిల్లాలో 560 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, 30 వేలకు పైగా విద్యార్థులు ఉన్నారు. గత జూలైలో నిర్వహించిన పరిశీలనలో రెండో తరగతి విద్యార్థుల్లో ఒకటో తరగతి స్థాయి నైపుణ్యాలు ఉన్నవారు కేవలం 20 శాతం మాత్రమే ఉన్నారు. ఉపాధ్యాయుల నిరంతర కృషితో సెప్టెంబర్‌ నాటికి 55 శాతానికి చేరి గణనీయమైన ప్రగతి నమోదైంది. అయితే ఇంకా 45 శాతం మంది విద్యార్థులు వెనకబడి ఉన్నారు. వీరిని కూడా ముందంజలో నిలపడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మిషన్‌ వందశాతం లర్నింగ్‌ కార్యక్రమంలో భాగంగా 2 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న ప్రతీ విద్యార్థి తెలుగు, ఇంగ్లిష్‌, గణితం సబ్జెక్టుల్లో పూర్తి నైపుణ్యం సాధించేలా బోధన సాగనుంది. ‘విద్యార్థి స్వయంగా చేసి చూపగలిగితేనే నిజమైన నైపుణ్యం’ అనే నినాదంతో పాఠశాలల్లో రోజు ప్రత్యేక సాధన చేయిస్తున్నారు. బడి పిల్లల్లో కనీస సామర్థ్యాలను(ఎఫ్‌ఎల్‌ఎన్‌) వందశాతం సాధించే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికలు రూపొందించింది. డీఈవో సచ్చిదానందచారి, క్వాలిటీ కోఆర్డినేటర్‌ ఉప్పులేటి శ్రీనివాస్‌ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటికే విజయవంతంగా మొదలైంది

ప్రత్యేక చొరవ చూపాలి

కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో విద్యార్థులకు కనీస సామర్థ్యాలను పెంపొందించాలని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది పది రోజులు కొనసాగుతుంది. ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలి. ఎంఈవోలు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. 2 నుంచి 5వ తరగతి విద్యార్థులకు తెలుగు, ఆంగ్లంలో చదవడం, రాయడం, గణితంలో చతుర్విద ప్రక్రియలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.

– సచ్చిదానందచారి, డీఈవో

నాలుగు మెట్ల వ్యూహం

పదిరోజుల ప్రత్యేక కార్యాచరణను నాలుగు నిర్దిష్ట దశల్లో రూపొందించారు. ఇందుకు అనుగుణంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటారు.

మొదటి మెట్టు: ప్రారంభ రోజు ఈ నెల 11న విద్యార్థుల సామర్థ్యాలను నిశితంగా పరిశీలించి, ఎవరెవరు ఏఏ సబ్జెక్టుల్లో ఏ నైపుణ్యాల్లో వెనుకబడ్డారో గుర్తించారు.

రెండో మెట్టు: విద్యార్థుల అభ్యసన స్థాయికి అనుగుణంగా రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ప్రత్యేక సాధన చేయిస్తారు.

మూడో మెట్టు: నూతన ప్రశ్నపత్రంతో విద్యార్థుల పురోగతిని మళ్లీ తనిఖీ చేస్తారు. అభ్యసన స్థాయి పెరిగిన వారిని గుర్తించి గ్రూపులను పునర్‌వ్యవస్థీకరిస్తారు.

నాలుగో మెట్టు: మిగిలిన రోజుల్లో ఇంకా వెనుకబడిన విద్యార్థులపై మరింత సమయం కేటాయిస్తారు. వారు నిర్దేశిత నైపుణ్యాలు సాధించడంపై దృష్టి సారిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement