మరోసారి తెరపైకి కంపెనీ భూముల వ్యవహారం ఆక్రమణల తొలగింపునకు అధికారుల చర్యలు 3,800 మందికి నోటీసులు.. ఆందోళనలో నివాసదారులు
ఆసిఫాబాద్క్రైమ్: కాగజ్‌నగర్ పట్టణ శివారు ప్రాంతంతోపాటు మండంలోని కోసిని, చింతగూడ గ్రామాల పరిధిలో ఉన్న సర్‌సిల్క్ లిమిటేడ్ కంపెనీకి చెందిన వందలాది ఎకరాల భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. చింతగూడ, కోసిని, సర్‌సిల్క్ ఎఫ్ కాలనీ తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వేలాది మందికి రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఎవిక్షన్ నోటీసులు జారీ చేయడంతో చర్చనీయాంశంగా మారింది. వారం రోజుల్లో స్థలాలను ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొనడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడం గమనార్హం.
నివాసదారులకు నోటీసులు
కాగజ్‌నగర్‌లోని సర్‌సిల్క్ ఫ్యాక్టరీ మూతపడిన అనంతరం కార్మికులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, వేతన బకాయిల పరిష్కారంలో భాగంగా 2009 లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నియమించిన లిక్విడేటర్ సర్‌సిల్క్ భూములను తన ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం బహిరంగ వేలం ద్వారా భూముల విక్రయానికి చర్యలు చేపట్టారు. మొత్తం 8 లాట్లుగా విభజించి ఒకటో లాట్లో 9.26 ఎకరాలు, రెండో లాట్లో 3.89 ఎకరాలు, మూడో లాట్లో 11.37 ఎకరాలు, నా లుగో లాట్లో 69.33 ఎకరాలు(ఫ్యాక్టరీ స్థలం), ఐదో లాట్లో 34.63 ఎకరాలు, ఆరో లాట్లో 187.39 ఎకరాలు, ఏడో లాట్లో 50.29 ఎకరా లు, ఎనిమిదో లాట్లో 91.21 ఎకరాలు మొత్తం 400 పైచిలుకు ఎకరాల భూమిని విక్రయానికి పె ట్టారు. ఇందులో దాదాపు 200 ఎకరాల పైచిలుకు భూమిని బిడ్డర్లు కొనుగోలు చేశారు. అయితే ఈ భూముల్లో ఇప్పటికే అనేక మంది కుటుంబాలు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాయి. మరోవైపు వేలంలో భూములు కొనుగో లు చేసిన వారు తమకు కేటాయించిన భూముల ను స్వాధీనం చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆ శ్రయించిన విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తున్న క్రమంలో వేలం ద్వారా భూములు కొనుగోలు చేసిన బిడ్డర్లకు భూముల ను స్వాధీనం చేయాలని ఉన్నత న్యాయస్థానం జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేర కు ఆరు నెలల్లో భూములను ఖాళీ చేయిస్తామని కలెక్టర్‌తోపాటు రెవెన్యూ అధికారులు న్యాయస్థానాన్ని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం సర్‌సిల్క్ భూముల్లో నివాసం ఉంటున్న 3,800 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. భూములను ఖాళీ చేయాలంటూ ఈ నెల 2 నుంచి ఆదేశిస్తున్నారు. కాగజ్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం నుంచి జారీ చేసిన నోటీసులో హైకోర్టు ఆదేశాలు, అధికారిక లిక్విడేటర్ దరఖాస్తు, కంపెనీ చట్టం– 1956 లోని సెక్షన్ 456ను ప్రస్తావిస్తూ ఏడు రోజుల్లో స్థలాన్ని ఖాళీ చేయాలని పేర్కొన్నారు.
సర్‌సిల్క్ భూముల్లో వెలసిన నిర్మాణాలు
రంగంలోకి దళారులు
సర్‌సిల్క్ లిమిటెడ్ భూముల వ్యవహారంలో నోటీసులు అందుకున్న బాధితుల ఆందోళనను కొందరు దళారులు అనుకూలంగా మలుచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చింతగూడకు చెందిన ఇద్దరు దళారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. బాధితుల తరఫున న్యాయ పోరాటం చేస్తామని నమ్మిస్తూ ఒక్కొక్కరి నుంచి రూ.వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. భూములు కోల్పోతామనే భయంతో ఇప్పటికే కొందరు డబ్బులు చెల్లించినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు.
రాజకీయ వేడి
మరోవైపు సర్‌సిల్క్ లిమిటెడ్ భూముల్లో నివాసం ఉంటున్న ప్రజలకు అధికారులు ఎవిక్షన్ నో టీసులు జారీ చేస్తున్న నేపథ్యంలో స్థానిక రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ధైర్యం చెబుతున్నారు. కోసిని, చింతగూడ ప్రాంతాల్లో నాయకులు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. బాధిత కుటుంబాల భవిష్యత్తుపై సర్వత్రా చర్చ జరుగుతోంది.


