కౌటాల: ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవ చేయడానికి బదులు అవినీతి పుట్టలుగా మారుతున్నాయి. నిరుపేదలు, సామాన్యుల కష్టాలను ఆసరాగా చేసుకుని కొంతమంది అధికారులు అక్రమ సంపాదనకు అలవాటు పడుతున్నారు. తాజాగా జిల్లాలో వెలుగు చూసిన రెండు వేర్వేరు ఘటనలు ఈ దుస్థితికి అద్దం పడుతున్నాయి. జిల్లా పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి అవినీతి వ్యవహారం జాతీయ ఎస్టీ కమిషన్ వరకు వెళ్లగా.. మరోవైపు కాగజ్‌నగర్‌లో ఏకంగా భూమి విరాసత్ కోసం లంచం డిమాండ్ చేసిన గ్రామ రెవెన్యూ అధికారి(జీపీవో) ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. కేవలం నగదు రూపంలోనే కాకుండా యూపీఐ పేమెంట్లు, బినామీ అకౌంట్ల ద్వారా డిజిటల్ లంచాలకు తెరలేపుతున్న అవినీతి అధికారుల బాగోతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఏసీబీ నిఘా కఠినతరం చేస్తున్నా క్షేత్రస్థాయిలో లంచగొండుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది.
ఫిర్యాదుకు వెనుకాడొద్దు..
రెవెన్యూ, పోలీసు, గనులు, విద్యుత్, రిజిస్ట్రేషన్లు తదితర శాఖల్లోనే ఎక్కువగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. గ్రామీణులకు సరైన అవగాహన లేకఫిర్యాదులకు ముందుకు రావడం లేదు. చాలా వ రకు ఫిర్యాదులు అందిన సమయంలోనే ఏసీబీ దా డులు చేస్తోంది. అయితే ఇటీవల అవినీతి నిరోధక శాఖకు అధికంగా ఫిర్యాదులు అందడం అశించదగ్గ పరిణామం. అయినా కొందరు ఉద్యోగులు తమ వక్రబుద్ధి వీడటం లేదు. సామాన్యులు పని కోసం ప్రభుత్వ కార్యాలయానికి వస్తే పైసల కోసం వేధిస్తున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్ చేస్తున్నారు. మున్సిపల్, ఎకై ్సజ్, విద్యుత్, ఇంజనీరింగ్, రెవెన్యూ, ఆర్టీఏ, మైనింగ్, అటవీ, విద్య, వైద్యం.. ఇలా ఏ శాఖలోనైనా పనుల కోసం లంచం అడిగితే ప్రజలకు వెనుకాడకుండా టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ నంబర్ 94404 46106కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు.


