వైద్యసేవలపై ‘సమ్మె’ ఎఫెక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వైద్యసేవలపై ‘సమ్మె’ ఎఫెక్ట్‌

Oct 31 2026 8:01 AM | Updated on Oct 31 2026 8:01 AM

కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఆందోళనలు

విధులకు దూరంగా 327 మంది

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం, వ్యాక్సినేషన్‌పై ప్రభావం

కాగజ్‌నగర్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. 19 రోజులుగా వారు విధులను బహిష్కరించడంతో వైద్య సేవలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వ్యాక్సినేషన్‌ సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితోపాటు జిల్లావ్యాప్తంగా 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 108 సబ్‌ సెంటర్లు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు 5, ఏరియా ఆసుపత్రి, టీ హబ్‌లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను నియమించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న డాక్టర్లు, ఫార్మసిస్టులు, ఆయుష్‌ వైద్యులు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎం, సెకండ్‌ ఏఎన్‌ఎంలు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 327 మందికి పైగా విధులు బహిష్కరించారు. రెగ్యులర్‌ సిబ్బందితో సమానంగా పనిచేస్తున్నా వేతనాలు తక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్‌, ఏఎంసీ సేవలు, గర్భిణులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏఎన్‌ఎం, ఏఎంసీ సేవలందించే వారు లేకపోవడంతో టీకాలు, చిన్నారులకు వేయాల్సిన రోటీన్‌ వ్యాక్సినేషన్‌(పోలియో, పెంటా, బీసీజీ)లు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. మరోవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ తగ్గి ఆశవర్కర్లపై భారం పడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిచాల్సి వస్తోంది.

వ్యాక్సినేషన్‌కు అవస్థలు

జిల్లావ్యాప్తంగా ఆస్పత్రుల్లో పిల్లలకు వ్యాక్సిన్లు వేయించేందుకు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంలోని నౌగాంబస్తీ అర్బన్‌ హెల్త్‌సెంటర్‌, కాగజ్‌నగర్‌ పీహెచ్‌సీలు ఒకేచోట ఉన్నాయి. ఆయా సెంటర్ల పరిధిలోని తల్లిదండ్రులు పిల్లలకు వ్యాక్సినేషన్‌ కోసం బుధవారం ఆస్పత్రికి వచ్చారు. అయితే వ్యాక్సినేషన్‌ సమయమైపోయిందని, భట్టుపల్లి పీహెచ్‌సీకి వెళ్లాలని, లేదా సర్‌సిల్క్‌లో వెళ్లాలని సిబ్బంది సూచించారు. నౌగాంబస్తీ పీహెచ్‌సీలో ఒక స్టాఫ్‌ నర్సు, సూపర్‌వైజర్‌, సర్‌సిల్క్‌లో ఒక ఎల్టీ, వైద్యురాలు మాత్రమే ఉన్నారు. అవసరమైన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయంపై అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వైద్యురాలు అఫ్సానాను వివరణ కోరగా.. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో విధులు నిర్వర్తింహించే సిబ్బంది సమ్మెలో ఉన్నందున ఇబ్బందులు తలెత్తినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement