తిర్యాణి: జల్, జంగల్, జమీన్ కోసం కుమురంభీంతో కలిసి వెడ్మ రాము చేసిన పోరాటం మరువలేనిదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. వెడ్మ రాము 39వ వర్ధంతి నేపథ్యంలో తిర్యాణి మండలం ఎదులపహాడ్ గ్రామంలోని ఆయన విగ్రహానికి శుక్రవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని, వాటిని కాపాడుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎదులపహాడ్‌లో వెడ్మ రాము నిలువెత్తు కాంస్య విగ్రహంతోపాటు కమ్యూనిటీ హాల్, మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్ధంతి సభకు ఏటా ఐటీడీఏ ద్వారా రూ.10లక్షలు కేటాయించాలని, ప్రత్యేక జీవో విడుదల కోసం అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు. అలాగే వచ్చే వర్ధంతి లోగా విజయనగరం నుంచి ఎదులపహాడ్ వరకు బీటీ రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో భాస్కర్, ఏజెన్సీ డీఈవో చందన్, జీసీడీవో శకుంతల, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మండ్ల జగదీశ్, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, వెడ్మ కమల, స్థానిక సర్పంచ్ మడావి పార్వతి, వర్ధంతి నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఆత్రం సంతోష్, నాయకులు మర్సుకోల తిరుపతి, దస్రు, వెడ్మ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


