చాలారూట్లలో ఆర్టీసీ బస్సులు లేక ప్రైవేట్ వాహనాలే దిక్కు పరిమితికి మించి విద్యార్థులు, ప్రయాణికుల తరలింపు అతివేగం, నిర్లక్ష్యంతోనే అధిక ప్రమాదాలు మూడేళ్లలో 139 రోడ్డు ప్రమాదాలు, 57 మంది మృత్యువాత మంచిర్యాల జిల్లా నస్పూర్ ఘటనతో మేల్కొంటేనే మేలు
ఆసిఫాబాద్: ‘రోడ్డు యాక్సిడెంట్ అంటే.. ఒక బైకో, కారో రోడ్డున పడటం కాదు సార్.. ఒక కుటుంబం మొత్తం రోడ్డున పడటం..’ ఓ తెలుగు సినిమాలో హీరో చెప్పే డైలాగ్ ఇది.. రహదారులపై చిన్నపాటి నిర్లక్ష్యం, అతి వేగం కుటుంబాలను తీరని విషాదంలోకి నెడుతుంది. మంచిర్యాల జిల్లా నస్పూర్ గేట్ వద్ద జరిగిన ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు, ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోనూ ఏటా ఇలాంటి రోడ్డు ప్రమాదా ల్లో వాహనదారులు, ప్రయాణికులు ప్రా ణాలు కోల్పోవడంతోపాటు శాశ్వత వికలాంగులు గా మారుతున్నారు. అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, ఆటోలు, ప్రైవేట్ వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం, నిబంధనలు పాటించకపోవడం వంటివి ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నా యి. ముఖ్యంగా ఆటోల్లో నిబంధనలకు విరుద్ధంగా 12 నుంచి 15 మందిని ఎక్కిస్తున్నారు. పల్లెల నుంచి మండల కేంద్రంలోని పాఠశాలలకు వచ్చే పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చిన్న ఆటోలోనే పది మంది వరకు ఉంటున్నారు. ఇక పెద్ద ఆటో అయితే 15 మందికి తగ్గడం లేదు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో తల్లిదండ్రులు సైతం ఎక్కువగా ఆటోల పైనే ఆధారపడుతున్నారు.
బ్లాక్‌స్పాట్లు గుర్తింపు
జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలు, 335 పంచాయతీల పరిధిలో 403 గ్రామాలు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు కేవలం ప్రధాన రూట్లలోనే నడుస్తుండటంతో ప్రయాణికులు, విద్యార్థులు ఎక్కువగా ప్రైవేట్ వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో విద్యాసంస్థల బస్సులు 109, ఆటోలు 5,851, జీప్‌లు 21, మ్యాక్సీ క్యాబ్‌లు 59, మోటర్ క్యాబ్‌లు 781 తదితర వాహనాలు ప్రయాణికులు, విద్యార్థులను నిత్యం తరలిస్తున్నాయి. పోలీసుశాఖ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ఆరు ప్రాంతాలను బ్లాక్‌స్పాట్లుగా ప్రకటించింది. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై మోడల్ స్కూల్ నుంచి అటవీశాఖ చెక్‌పోస్టు వరకు, వాంకిడి మండలం బంబార ప్రధాన రహదారి, లంజన్‌వీర, గణేశ్ పూర్ 94 కిలోమీటర్ రాయి వద్ద, కాగజ్‌నగర్‌లోని ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి అరుణోదయ పాఠశాల వరకు, రాజునగర్ బోర్డ్ నుంచి ఈఎస్‌ఐ టర్నింగ్ వరకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించారు.
తరచూ ప్రమాదాలు
గత మూడేళ్లలో జిల్లా వ్యాప్తంగా 139 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 59 మంది మృత్యువాత పడ్డారు. వంద మందికి పైగా గాయాలయ్యారు. అనధికారికంగా ఈ లెక్కలు మరింత ఎక్కువగానే ఉంటాయి. జిల్లా కేంద్రంలోని గుండి రహదారి నుంచి హైవే వెళ్లే అండర్ బ్రిడ్జి వద్ద గతేడాది జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు బైక్‌తో ట్రాక్టర్‌ను ఢీకొనడంతో మృతి చెందాడు. జాతీయ రహదారి నుంచి జిల్లా కేంద్రంలోకి ప్రవేశించే మార్గంలో జరిగిన ఓ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. రాత్రిపూట గుంతలు కనిపించకపోవడం, అటవీ జంతువులు, పశువులు, నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలు రోడ్లపై పార్కింగ్ చేయడంతోనూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.
వాంకిడి: మండలంలోని పల్లె ప్రజలకు ఆటోలే దిక్కవుతున్నాయి. 28 పంచాయతీల్లో జాతీయ రహదారిపై ఐదు పంచాయతీలే ఉన్నాయి. గతంలో ధాబా, సర్కేపల్లి రూట్‌లలో బస్సులు నడవగా, కొన్నేళ్లుగా సర్వీసులు నిలిపివేశారు. జాతీయ రహదారిపై భారీ వాహనాల రాకపోకలతో ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ.


