కౌటాల: వ్యవసాయ రంగానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ఆరోపించారు. కౌటాల విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. మిర్చి, వరి పంటలకు అందిస్తున్న విద్యుత్ సరఫరా వివరాలను అడిగి తెలుసుకుని లాగ్‌బుక్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కౌటాల మండలంలో దాదాపు ఐదు వేల ఎకరాల వరకు మిర్చి సాగు చేస్తున్నారని, కానీ ఏడు గంటల వరకు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారన్నారు. సరిపడా నీటితడులు అందించలేకపోవడంతో పంటలు ఎండిపోతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం 12 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే విద్యుత్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏడీఈ ఇర్ఫాన్, ఏఈ ప్రశాంత్, నాయకులు మల్లయ్య, విజయ్, వానుపటేల్, మిథున్, తిరుపతి, మోరేశ్వర్, శంకర్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.


