వాడవాడలా ముస్తాబైన మండపాలు విద్యుత్ కాంతులు, ఆకట్టుకునే డిజైన్లతో అలంకరణ తీరొక్క రూపాల్లో ఆదిదేవుడు నేడు వినాయక చవితి
ఆసిఫాబాద్: సర్వ విఘ్నాలను తొలగించి.. సకల శుభాలను ప్రసాదించే ఆ బొజ్జ గణపయ్యను ప్రతిష్టించుకోవడానికి జిల్లా అంతా భక్తిపారవశ్యంతో ఎదురుచూస్తోంది. విఘ్నేశ్వరుడిని కొలిచేందుకు వాడవాడలా మండపాలు ముస్తాబవుతున్నాయి. ఆదిదేవుడి ఆగమనం కోసం నిర్వాహకులు విద్యుత్ కాంతులు, డెకరేషన్లు, పందిళ్లు, షామియానాలతో అలంకరించారు. కొందరు పర్యావరణ స్పృహతో మట్టి గణపతులను పూజించేందుకు సిద్ధమయ్యారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా సుమారు 800 నుంచి 1000 వరకు విగ్రహాలను ప్రతిష్టించే అవకాశం ఉంది. జిల్లా కేంద్రంలోనే సుమారు 50కి పైగా మంటపాలు ఏర్పాటు చేస్తున్నారు.
గ్రామాలకు చేరుతున్న విగ్రహాలు
వినాయక చవితి సందర్భంగా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాల్లో భారీ విగ్రహాలు అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. నిర్వాహకులు వారం ముందు నుంచే ఏర్పాట్లలో నిమగ్నం కాగా, విగ్రహాలను ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారు. కొందరు శని, ఆదివారం నుంచే ప్రత్యేక వాహనాల్లో గ్రామాలకు తరలించారు. మంచిర్యాల, కోరుట్ల వంటి ప్రాంతాల నుంచి కూడా విగ్రహాలను తెప్పించుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని బజార్‌వాడి సంఘసేవా గణేశ్ మండలి వద్ద 18 అడుగుల భారీ గణనాథుడిని ప్రతిష్టించనున్నారు. ఆదివారం మార్కెట్లు విగ్రహాలు, పూజా సామగ్రి కొనుగోళ్లతో కళకళలాడాయి. భక్తులు పూజకు అవసరమైన పువ్వులు, పత్రి, పూజా సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని మండలాల్లో పోలీసులు ఉత్సవ కమిటీ ప్రతినిధులతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించారు. విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు అనుసరించాల్సిన నిబంధనలపై దిశానిర్దేశం చేశారు.


