మార్కెట్లకు ఊతం.. | - | Sakshi
Sakshi News home page

మార్కెట్లకు ఊతం..

Sep 13 2026 11:45 PM | Updated on Sep 13 2026 11:45 PM

● పండుగల వేళ కొనుగోళ్ల సందడి ● కళాకారులు, చేతివృత్తిదారులకు ఉపాధి

వేలాది మందికి ఉపాధి

వినాయక ఉత్సవాల కోసం ఏడాది మొత్తం ఎదురుచూస్తుంటాం. జిల్లాలో సుమారుగా ఎనిమిది వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఉత్సవాల నిర్వాహకులు సైతం స్థానికంగా కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు.

– మిథున్‌ మండల్‌, రవీంద్రనగర్‌, మం.చింతలమానెపల్లి

అమ్మకాలు పెరుగుతాయి

పండగ వేళల్లో దుకాణాల్లో అమ్మకాలు పెరుగుతాయి. తద్వారా మాకు ఆదాయం లభిస్తుంది. గ్రామీణ షాపులతోపాటు సూపర్‌ మార్కెట్లలోనూ రద్దీ పెరిగి గణనీయంగా విక్రయాలు జరుగుతాయి.

– బొద్దున శ్రీనివాస్‌, వ్యాపారి, కౌటాల

చింతలమానెపల్లి: పండగలంటే కేవలం నోములు, వ్రతాలు, పూజలు మాత్రమే కాదు. అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా.. రాఖీ పౌర్ణమి, పొలాల అమావాస్య, వినాయక చవితి, దసరా, దీపావళి తదితర పండుగలు మారెట్లకు ఊతం ఇస్తున్నాయి. జిల్లాలో పర్వదినాలను పురస్కరించుకుని నిత్యావసరాలు, పూజా సామగ్రి, అలంకరణ వస్తువులు, కూరగాయల కొనుగోళ్లతో మార్కెట్లు కళను సంతరించుకున్నాయి. పొలాల అమావాస్యకు మట్టి ఎద్దుల తయారీ, వినాయక చవితికి మట్టి విగ్రహాలు, దీపావళికి ప్రమిదల తయారీతో మట్టి కళాకారులకు ఉపాధి లభిస్తోంది. దసరాకు తయారు చేసే అమ్మవారి విగ్రహాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మట్టి రూపాల తయారీతో వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. చింతలమానెపల్లి, బెజ్జూర్‌, కౌటాల, జైనూర్‌, కెరమెరి, వాంకిడి వంటి గ్రామీణ మండలాల్లో తయారు చేసిన మట్టి ఆకృతులను కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల తదితర పట్టణాలకు తరలించి విక్రయిస్తున్నారు. అలాగే పండుగ సమయాల్లో కిరాణా దుకాణాల నుంచి సూపర్‌ మార్కెట్ల వరకు కొనుగోలుదారులతో సందడిగా మారుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా శనివారం నుంచే మండల కేంద్రాలు సందడిగా మారగా కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ల్లో రద్దీగా మారాయి. వినాయక చవితికి విద్యుత్‌ అలంకరణ వస్తువులు, వెదురు బొంగులకు డిమాండ్‌ పెరిగింది. కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌తోపాటు మంచిర్యాల, చంద్రపూర్‌, హైదరాబాద్‌ వరకు నిర్వాహకులు వెళ్లి అలంకరణ వస్తువులు కొంటున్నారు. అలంకరణలు, సౌండ్‌, లైటింగ్‌పై సుమారుగా ఎనిమిది వేల మంది వరకు ఆధారపడి ఉపాధి పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement