కౌటాల: వరుస పండుగల నేపథ్యంలో జిల్లాలో కోడి పందేలు జోరందుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా నిర్వహిస్తున్నారు. పక్కా ప్లానింగ్‌తో పోలీసులు, జన సంచారం లేని స్థలాల్లో ఈ స్థావరాలు కొనసాగడం విశేషం. ఆదివారం ఒక్కరోజే జిల్లాలో రెండు మండలాల్లో పోలీసులు దాడులు చేసి నిందితులపై కేసు నమోదు చేశారు. బెజ్జూర్ మండలం ముంజంపల్లి గ్రామ శివారులో ఆదివారం కోడి పందేల స్థావరంపై దాడి చేసి పది మందిని అదుపులోకి తీసుకున్నారు. మూడు పందెం కోళ్లు, మూడు కత్తులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు చింతలమానెపల్లి మండలం గూడెం గ్రామ శివారులోనూ కోడి పందేలు నిర్వహిస్తున్న ఏడుగురిని పట్టుకున్నారు. ఐదు కోళ్లతోపాటు రూ.1560 నగదు, రెండు కత్తులు, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ నెల 12న సైతం బెజ్జూర్ మండలం కొత్తగూడెం శివారులో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. మూడు పందెం కోళ్లు, రెండు కత్తులు, రూ.600 నగదు స్వాధీనం చేసుకున్నారు.
దాడులు చేస్తున్నా..
పొలాల పండుగ నుంచి కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో ఈ కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పందెం ఆడేవారు కోళ్లను బైక్‌లపై స్థావరాలకు తరలిస్తున్నారు. వారంతపు సెలవుల్లో నిర్వహిస్తున్న కోడి పందేలపై పోలీసులు దాడులు చేస్తున్నా.. నిందితుల్లో మార్పు రావడం లేదు. పోలీసుల నిఘాకు దొరకకుండా నిత్యం స్థావరాలు మారుస్తున్నారు. ఈ ఆటపై నిషేధం ఉండగా, జంతు హింస నిరోధక చట్టం– 1960 ప్రకారం సెక్షన్– 11 కింద కేసులు నమోదు చేస్తారు.


