ఉమ్మడి జిల్లాలో 47 మంది
బెల్లంపల్లి: అనాథగా మిగిలిపోయిన చిన్నారులకు అమ్మానాన్నల ప్రేమ లభిస్తోంది. అర్హులైన దంపతులకు పిల్లలను చట్టబద్ధంగా దత్తత ఇవ్వడం ద్వారా వారికీ ఓ కుటుంబం ఏర్పడుతోంది. అనాథ పిల్లలను కుటుంబం చెంతకు చేర్చడంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముందంజలో ఉంది. దత్తత పొందిన దంపతులు చిన్నారులను అక్కున చేర్చుకుని మమతానురాగాలు పంచుతున్నారు. పేగుబంధాని కన్నా మిన్నగా అనుబంధాన్ని పెనవేసుకుంటున్నారు. దత్తత ద్వారా చిన్నారులు కొత్త కుటుంబాల్లోకి అడుగు పెడుతుండడం వారికి ఆనందాన్ని పంచుతోంది.
మరో 123 మంది ఎదురుచూపు
సంతానం లేని దంపతులు పిల్లల దత్తత కోసం తీవ్రంగా ఆరాట పడుతున్నారు. 2021 నుంచి 2026 ఆగస్టు 31 వరకు ఏకంగా 123 మంది దత్తత కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. తమవంతు ఎప్పుడెప్పుడా అని పడిగాపులు కాస్తున్నారు. కాగా 2000 సంవత్సరానికి ముందు దాదాపు 5 వరకు దరఖాస్తులు తిరస్కరించారు. దరఖాస్తు దారు ఆర్థిక స్థితిగతులు, గుణ గణాలు ఇతర అంశాలు ప్రతికూలంగా ఉన్నట్లు నిర్ధారించుకుని దత్తతకు నిరాకరించారు. కాగా ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులనూ ఆదరించడానికి ఎవరైనా ముందుకు రావల్సిన అవసరం ఉంది. చిన్నారులను దత్తత తీసుకోవాలనే ఆసక్తి కలిగిన దంపతులు వివరాల కోసం ఆదిలాబాద్‌లోని శిశుగృహ కేంద్రాన్ని సంప్రదించవచ్చు. శిశుగృహ మేనేజర్ విజయలక్ష్మిని ఫోన్ నంబరు 70958 21533లో సంప్రదించవచ్చు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శిశుగృహ 57 మంది అనాథ చిన్నారులకు ఆశ్రయం కల్పించింది. వీరిలో ఇప్పటి వరకు 47 మంది బాలబాలికలు దత్తతకు వెళ్లగా ప్రస్తుతం ఆరుగురు మా త్రమే ఉన్నారు. ఇందులో ముగ్గురు దివ్యాంగులు ఉన్నారు. మరో నలు గురు చిన్నారులు తా త్కాలిక వసతి పొంది వెళ్లిపోయారు. దత్తత వె ళ్లిన చిన్నారుల్లో 26 మంది బాలికలు, 21 మంది బాలురు ఉన్నారు. ఇందులో 2000 సంవత్సరా నికి పూర్వం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు 32 మంది చిన్నారులను దత్తత ఇవ్వగా ఆ తర్వాత ఏడాది 2021 నుంచి 2026 ఆగస్టు 31 వరకు ద రఖాస్తు చేసుకున్న దంపతుల్లో అర్హతల ప్రాతిపదికన 15 మంది చిన్నారులను దత్తతఇచ్చారు.
ఇతర రాష్ట్రాల నుంచి..
ఉమ్మడి జిల్లాకు చెందిన చిన్నారులను ఇతర రాష్ట్రాల తల్లిదండ్రులు దత్తత తీసుకుంటున్న మాదిరిగానే ఇతర జిల్లాలు, పరాయి రాష్ట్రాలకు చెందిన బాలబాలికలను మన ఉమ్మడి జిల్లా దంపతులు దత్తత తీసుకోవడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. 2000 నుంచి 2026 ఆగస్టు నెలాఖరు వరకు 42 మంది చిన్నారులను దత్తత తెచ్చుకున్నారు.
అందరూ వంచితులే..
నవ మాసాలు మోసి జన్మనిచ్చిన తర్వాత పిల్లలు ఏదో రకంగా వంచితులు అవుతున్నారు. కారణమేదైనా కొందరు శిశువులు పసిప్రాయంలోనే అనాథలుగా మారుతున్నారు. ఆడపిల్లలు అనే వివక్షతో వదిలి వెళ్తుండగా.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, పోషణ భారం తదితర అంశాలతో శిశుగృహకు చేరుతున్నారు.


