నష్టం రూ.2.5కోట్లు
● వాడుతున్న పంటలకు జీవం
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్ రూరల్: జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు వర్షం కురిసింది. వానలు లేక పక్షం రోజులుగా వివిధ పంటలు వాడిపోతుండగా తాజాగా కురిసిన వర్షం జీవం పోసినట్లయింది. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తంజేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో సాధారణం కంటే 15నుంచి 20శాతం తక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. జిల్లాలో ఇప్పటివరకు సాధారణం కంటే లోటు వర్షపాతమే నమోదైంది.
పంటలకు జీవం పోసిన వాన
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 4.52 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. వీటిలో 3.70 లక్షల ఎకరాల్లో పత్తి, 47వేల ఎకరాల్లో వరి, 21వేల ఎకరాల్లో కంది, 7.5 వేల ఎకరాల్లో మక్క, 5,700 ఎకరాల్లో ఇతర పంటలు సాగు కానున్నట్లు అధికారుల అంచనా. కాగా, ఇప్పటివరకు 1,40,760 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, వీటిలో 1,32,150 ఎకరాల్లో పత్తి, 8,250 ఎకరాల్లో కంది, 35 ఎకరాల్లో పెసర సాగు చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పత్తి విత్తినప్పటి నుంచి దశలవారీగా రైతులు కలుపు తీస్తూ, ఎరువులు వేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో మొక్కలు ఏవుగా పెరిగి పూత, కాత దశలో ఉండగా, వర్షాలు లేక వాడిపోతున్నాయి. చేలల్లో చెట్ల మధ్య కలుపు తొలగించి, దౌర కొట్టి ఎరువు వేశారు. ఏపుగా పెరిగిన పత్తి, సోయా పంటలకు ఈ వర్షం ఎంతో మేలు చేసింది. జిల్లాలో వరి నాట్లు కూడా కొనసాగుతున్నాయి.
26మిల్లీ మీటర్ల వర్షపాతం
శనివారం జిల్లాలో 47.24 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా రెబ్బెన మండలంలో 93.5 మిల్లీ మీటర్లు కురిసింది. కాగజ్‌నగర్‌లో 78.8, కెరమెరిలో 64.3, వాంకిడిలో 48.8, ఆసిఫాబాద్‌లో 38.5, పెంచికల్‌పేట్‌లో 38.0, దహెగాంలో 33.0, సిర్పూర్(టీ)లో 28.5, బెజ్జూర్‌లో 24.5, తిర్యాణిలో 14.5, జైనూర్‌లో 10.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్ మండలంలోని కుమురంభీమ్ ప్రాజెక్ట్‌లో ఎగువనుంచి వరదనీరు చేరడంతో రెండు గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్ట్ గరిష్ట నీటి మట్టం 10.393 క్యూసెక్కులు కాగా, 6.137 క్యూసెక్కులకు చేరింది. ఇన్‌ఫ్లో 2,172 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 1,378 కూసెక్కులున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
పత్తి పంటకు మేలు
పక్షం రోజులుగా రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా కురిసిన వర్షాలు పత్తి పంటకు మేలు చేశాయి. జిల్లాలో పంటల సర్వే కొనసాగుతోంది. సర్వేయర్లు పొలాల వద్దకు వచ్చినప్పుడు రైతులు అందుబాటులో ఉండి, సాగు చేసిన పంటల వివరాలు నమోదు చేసుకోవాలి. వివరాలు ఆన్‌లైన్‌లో నమోదైతేనే పండించిన పంటను విక్రయించే వీలుంటుంది.
– మిలింద్, ఏడీఏ
కుమురంభీం ప్రాజెక్ట్ రెండు గేట్ల నుంచి దిగువకు వెళ్తున్న నీరు
నిలిచిన బొగ్గు ఉత్పత్తి..
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఏరియాలోని ఖైరిగూ ర ఓసీపీ రోజువారీ ఉత్పత్తి లక్ష్యం సుమా రు 8వేల టన్నులు కాగా, క్వారీ లోపలి బొగ్గు ఉత్పత్తి ప్రాంతాలు వర్షపు నీటితో నిండాయి. దీంతో ఉత్పత్తి ప్రక్రియ నిలిపివేశారు. రెండో షిఫ్టు సమయానికి వర్షం తగ్గకపోవడంతో అధికారులు ఉత్పత్తి చేపట్టలేకపోయారు. సాయంత్రం కాస్త విరా మం ఇచ్చినా రాత్రి నుంచి ముసురు మొ దలైంది. దీంతో నైట్‌షిఫ్టులోనూ ఉత్పత్తి కొనసాగించే అవకాశాలు కనిపించలేదు. క్వారీలోని హాల్‌రోడ్లు బురదమయంగా మారడంతో డంపర్లను ఉపరితలంలో నిలిపివేశారు. వర్షం కారణంగా క్వారీ లోపలికి చేరుతున్న నీటిని ప్రత్యేక మోటర్ల ద్వారా తోడి బయటకు పంపిస్తున్నారు. మొదటి, రెండో షిఫ్టులో సుమారు 5వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టపోయినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. నష్టపోయిన బొగ్గు ఉత్పత్తి విలువ సుమారు రూ.2.5 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
కుమురంభీం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత
ఆసిఫాబాద్ మండలంలోని కుమురంభీమ్ ప్రాజెక్ట్ సామర్థ్యం 10.393 టీఎంసీలు (238 మీటర్లు) కాగా, ప్రస్తుతం 6.137 టీఎంసీలుగా ఉంది. 2,172 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా రెండు గేట్లు ఎత్తి 1,378 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ దిగువనున్న రాజుర, గుండి, రహపల్లి గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ప్రాజెక్ట్ అధికారులు సూచించారు.


