రెబ్బెన: గణేశ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా మట్టి విగ్రహాలను నెలకొల్పి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని బెల్లంపల్లి ఏరియా జీఎం శ్రీరమేశ్ సూచించారు. గోలేటి టౌన్‌షిప్‌లో సింగరేణి ఆధ్వర్యంలో శనివారం మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడారు. ప్రకృతిలో మమేకమై జీవిస్తేనే అన్ని రకాల జీవరాసులకు ఆరోగ్యకరమైన మనుగడ ఉంటుందని తెలిపారు. పీవోపీ, రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను చెరువులు, వాగుల్లో నిమజ్జనం చేస్తే జలవనరులు కలుషితమవుతాయని పేర్కొన్నారు. దేవుడిని భక్తితో పూజించడంతోపాటు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. ఏఐటీయూసీ నాయకుడు మారం శ్రీనివాస్, సీఎంవోఏఐ అధ్యక్షుడు నరేందర్, ఎస్వోటూ జీఎం రాజమల్లు, ఏరియా ఇంజినీర్ వీరన్న, ఏరియా సేఫ్టీ అధికారి స్వామి రాజు, డీజీఎం ఉజ్వల్‌కుమార్ బెహరా, సీనియర్ పీవో శ్రీనివాస్, ప్రశాంత్, ఇన్‌చార్జి ఎన్విరాన్‌మెంట్ అధికారి రమేశ్ తదితరులున్నారు.


