సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రేషన్ బియ్యం కేసులో అక్రమాలకు పాల్పడుతూ ఆధారాలతో దొరికిన బెజ్జూర్ ఎస్సై సర్తాజ్ పాషాపై వేటు పడింది. బెజ్జూరు పీఎస్ బాధ్యతల నుంచి తప్పించి జిల్లా కేంద్రానికి అటాచ్ చేస్తూ ఈ నెల 11న ఉత్తర్వులు వెలువడ్డాయి. గత నెల 30న ‘సాక్షి’లో ‘ఆ ఎస్సైపై వేటు?’ శీర్షికన కథనం ప్రచురితమైంది తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఎస్పీ నితికాపంత్ సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించి శాఖాపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. తాజాగా అటాచ్ చేశారు. ఉన్నతాధికారుల తదుపరి ఆదేశాల మేరకు సస్పెన్షన్ వేటు వేస్తారా?.. లేదా? అనేది తేలాల్సి ఉంది.
తొలినాళ్లలోనే వసూళ్ల పర్వం!
శిక్షణ పూర్తయిన తొలినాళ్లలోనే సదరు ఎస్సై వసూళ్లకు పాల్పడడం విస్మయానికి గురి చేసింది. బెజ్జూరు పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న సమయంలో పీడీఎస్ బియ్యం వ్యాపారుల నుంచి నెలనెలా వసూళ్లకు పాల్పడ్డారు. అక్రమ దందా చేసే వర్గాల మధ్య ఉన్న విభేదాలను క్యాష్ చేసుకోవాలని యత్నించారు. గత నెలలో మహారాష్ట్రకు రేషన్ బియ్యం తరలిస్తూ పట్టుబడిన ఆటోలను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. అయితే, మరోచోట డంప్ చేసిన పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేయకుండా నిందితుడికి తెలియకుండానే మరో వ్యక్తితో అమ్మించారు. ఆ డబ్బులు తనకు తెలిసిన మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తికి ఫోన్ పే చేయించారు. ఈ విషయం డీసీసీ మైనార్టీ చైర్మన్ అర్షద్ హుస్సేన్‌కు బాధితులు తెలియజేయడంతో ఆధారాలతో ఎస్పీకి అందజేశారు. దీనిపై విచారణ చేపట్టగా, ఎస్సై డబ్బులు తీసుకున్న విషయం నిజమేనని తేలింది. దీంతో చర్యలు తీసుకోక తప్పలేదు.
చర్యలు ఖాయమని తెలిసిన
తర్వాత కూడా..
బెజ్జూర్ ఎస్సై వ్యవహారం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. తనపై చర్యలు తీసుకోవడం ఖాయమని తెలిసి కూడా సదరు ఎస్సై వసూళ్లకు పాల్పడడం మరింత ఆఽశ్చర్యానికి గురి చేస్తోంది. ‘‘సర్ ట్రాన్స్‌ఫరై పోతున్నాడు.. నెలనెలా ఇచ్చే మామూళ్లు ఇప్పుడే ఇవ్వాలి’’ అంటూ స్టేషన్‌లో పని చేస్తున్న ఓ ప్రైవేట్ వ్యక్తితో ఎస్సై ఫోన్ చేయించారు. దీనిపై ఫోన్ సంభాషణ ఆడియో కూడా బయటపడింది. గతంలో ఇదే పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఓ వ్యక్తికి పలుసా ర్లు చెల్లించిన డబ్బుల వివరాలూ బయటకు రావడంతో మరింత లోతుగా విచారణ సాగుతోంది. మరోవైపు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా టాస్క్‌ఫోర్స్‌లో ఏళ్లపాటు పాతుకుపోయి, అనేక అక్రమ దందాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో హెడ్ కానిస్టేబుల్‌నూ ములుగు జిల్లాకు బదిలీ చేశారు. అయితే, డీపీవోలో పని చేస్తున్న మరో కానిస్టేబుల్‌పై ఆరోపణలు వస్తున్న తరుణంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ డిపార్ట్‌మెంట్‌లో నడుస్తోంది.


