ఆసిఫాబాద్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని వైద్య కళా శాలకు అనుబంధంగా బోధనాస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసి మూడేళ్లయినా పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లు లేరు. ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌తో నెట్టుకొస్తున్నారు. 305 మంది వైద్యులకు కేవలం 38 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. 210 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 22 మంది ఉండగా, 188 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు ఒక్కరే ఉన్నారు. 95 మంది కాంట్రాక్టు వైద్యులకు 11 మంది ఉండగా, ఏడుగురు ఆర్‌ఎంవోలు, ఆరుగురు క్యాజు వాలిటీ మెడికల్ అధికారులు, 11 మంది స్పెషలైజేషన్ వైద్యులకు ఒక్కరూ లేరు. అసిస్టెంట్ ప్రొఫెసర్లే అదనపు బాధ్యతలు చేపడుతున్నారు. రౌండ్‌ది క్లాక్ 18 మంది మత్తు డాక్టర్లకు ఒక్కరే ఉన్నారు. ఐసీయూ సెటప్ వైద్యులు లేక సర్జరీలు జరగడం లేదు. ఈఎన్‌టీ, ఫోరెన్సిక్, మైక్రో బ యాలజీ నిపుణులు లేరు. ఆర్థో మిషన్, సర్జరీ ఎక్విప్‌మెంట్, సిటి స్కాన్, ఎమ్మారై స్కానింగ్ యంత్రాలు లేవు. బ్లడ్ బ్యాంకులో టెక్నీషియన్లు, యంత్రాలు లేకపోవడంతో నిల్వకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల కాగజ్‌నగర్‌కు చెందిన ఓ గైనకాలజిస్టు రావడంతో ఐదు సిజేరియ న్లు చేసినట్లు డీసీహెచ్ డాక్టర్ కిరణ్ తెలిపారు.
మందుల కొరత
జిల్లా ఆస్పత్రిలో బీపీ, షుగర్, ఇన్ఫెక్షన్లతో పాటు హృద్రోగులకు అవసరమైన అప్‌గ్రేడ్ మందులు అందుబాటులో ఉండడం లేదు. 10, 15 ఏళ్ల క్రితం నుంచి వాడుతున్నవే ఉన్నాయి. ఆస్పత్రి ప్రొఫెసర్లు అధునాతన మందులు రాస్తుండగా అవి దొరక్కక కొంతమంది బయట కొనుగోలు చేస్తున్నారు. మూడు నెలలుగా ప్యాన్‌టాప్ ఇంజెక్షన్లు, ఎవిల్స్, సిరంజీలు, హైడ్రో కార్టిసన్ ఇంజెక్షన్లు అవసరానికి సరిపడా సరఫరా చేయడం లేదు. ప్యాన్‌టాప్ ఇంజెక్షన్లకు బదులు ట్యాబ్లెట్లు వాడుతున్నారు. పీహెచ్‌సీల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని డీఎంహెచ్‌వో నాగేంద్ర తెలిపారు. నెల రోజులుగా లిఫ్ట్ పని చేయకున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. 17 పీహెచ్‌సీల్లో 44 మంది వైద్యులకు కేవలం 14 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. వైద్యుల కొరతతో ఒక్కో డాక్టర్ రెండు, మూడు పీహెచ్‌సీలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు సీజనల్, విష జ్వరాలతో ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు క్యూ కడుతున్నారు. చాలా పీహెచ్‌సీలు సాయంత్రం 4 గంటల వరకే పనిచేస్తుండటంతో అత్యవసర పరిస్థితుల్లో స్థానిక ఆర్‌ఎంపీలు, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. పాముకాటు, పురుగుల మందు ప్రభావానికి గురైన సందర్భాల్లో అత్యవసర చికిత్స అందేలా 24గంటలు ఆస్పత్రి కొనసాగించాలని జిల్లా ప్రజలు విన్నవిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులను ‘సాక్షి’ మంగళవారం విజిట్ చేయగా, పలు సమస్యలు వెలుగు చూశాయి.
కౌటాల: కౌటాల పీహెచ్‌సీ రౌండ్ ది క్లాక్ ఆస్పత్రి కావడంతో కౌటాల, చింతలమానెపల్లి మండలాల రోగులకు ఇదే ప్రధాన దిక్కు. ప్రతిరోజూ సుమారు 80 మందికి పైగా ఓపీ వస్తున్నారు. ఇద్దరు వైద్యులకు ప్రస్తుతం ఒక్కరే పనిచేస్తున్నారు. ప్రసవాలు, ఓపీల కారణంగా ప్రస్తుత డాక్టర్ కార్తీక్‌పై పనిభారం పడుతుండగా, స్థాని కుడు కావడంతో ఆయన నిత్యం అందుబాటులో ఉంటున్నారు. నలుగురు స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు. ప్రతీ సోమవారం, గురువారం రోగులకు రక్త, మూత్ర పరీక్షలు చేసి నమూనాలను ఆసిఫాబాద్‌కు పంపిస్తున్నారు. పాము, కుక్క కాటు వ్యాక్సిన్లు, ఇతర మందులు అందుబాటులో ఉన్నా యి. ప్రతినెలా 20కి పైగా సాధారణ కాన్పులు చేస్తున్నారు. కౌటాల పీహెచ్‌సీకి మరో వైద్యుడిని నియమించడంతోపాటు 50 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలని, డయాలసిస్ కేంద్రం వెంటనే ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.
జిల్లా ఆస్పత్రిలో 38 మందే..
గర్భిణులకు అందని సేవలు
లింగాపూర్: లింగాపూర్ పీహెచ్‌సీలో ఎంబీబీఎస్ వైద్యులు లేకపోవడంతో ఆయుష్ వైద్యులే సేవలందిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు సిర్పూర్(యూ), జైనూర్‌కు వెళ్లాల్సి వస్తుంది. హెల్త్ అసిస్టెంట్లు లేరు. నిత్యం సుమారు 80 మంది వరకు ఓపీ నమోదవుతుంది. రాత్రిపూట అత్యవసరమైతే వైద్యం అందడం లేదు. ఆస్పత్రిని 24 గంటలపాటు నిర్వహించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ప్రతిరోజూ 80 మందికి పరీక్షలు
పెంచికల్‌పేట్: పెంచికల్‌పేట్ పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులకు మంగళవారం ఒకరు సెలవులో ఉండగా మరొకరు విధులకు హాజరయ్యారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజూ సుమారు 80 మంది రోగులను పరీక్షించి మందులు అందిస్తున్నారు. పీహెచ్‌సీ పరిధిలోని ఐదు సబ్ సెంటర్లలో ఐదు ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


