ఆసిఫాబాద్: రక్షాబంధన్ పండుగ ఆర్టీసీకి కలిసొచ్చింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీతో ఆసిఫాబాద్ డిపోకు భారీ ఆదాయం సమకూరింది. తోబుట్టువులు సొతూళ్లకు వెళ్లాల్సి రావడం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉండటంతో ప్రయాణికులు ఎక్కువగా ప్రజారవాణా వైపు మొగ్గు చూపారు. పండుగ సందర్భంగా మూ డు రోజుల ముందు నుంచి డిపోలో 20 అదనపు బస్సులు ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయం వచ్చింది. డిపోలో 109 మంది కండక్టర్లు, 123 మంది డ్రైవర్లు, 50 మంది ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 79 బస్సు సర్వీసులు 39 రూట్లలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. సాధారణ రోజుల్లో ప్రతిరోజూ బస్సులు 32 వేల కిలోమీటర్లు తిరుగుతుండగా, రాఖీ సందర్భంగా రెండురోజుల్లో 1,02,414 మంది ప్రయాణికులు 69 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. వీరిలో 72,491 మంది మహాలక్ష్మి పథకం కింద మహిళలే ఉండటం గమనార్హం.
సిబ్బంది కొరత
జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆర్టీసీ యాజమాన్యం కేవలం ఆదాయంపైనే దృష్టి పెట్టి సిబ్బందిని భర్తీ చేయకపోవడంతో ఉన్న వారిపై అదనపు భారం పడుతోంది. డిపోలో 132 మంది కండక్టర్లకు 109 మంది, 134 మంది డ్రైవర్లకు 123 మంది పనిచేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో దశాబ్దాల క్రితం నిర్మించిన ఐదు ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. పెరుగుతున్న రద్దీకి ప్లాట్‌ఫారాలు సరిపోవడం లేదు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరో ఐదు ప్లాట్ ఫారాలు విస్తరించాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు.
ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడిపించాం. ఈ నెల 27,28 రెండు రోజుల్లో డిపోకు రూ.50.39 లక్షల ఆదాయం సమకూరింది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఎంకై ్వరీ నం.9493282510 ఏర్పాటు చేశాం.
– రాజశేఖర్, డిపో మేనేజర్, ఆసిఫాబాద్
రూ.50.39 లక్షల ఆదాయం
సాధారణ రోజుల్లో ప్రతిరోజూ డిపో ఆదాయం రూ.16 లక్షలు కాగా, పండుగ సందర్భంగా రోజుకు రూ.20 లక్షల టార్గెట్ విధించారు. ఈ నెల 27, 28 తేదీల్లో డిపోకు రూ.50.39 లక్షల ఆదాయం సమకూరింది. ప్రయాణికుల రద్దీతో లక్ష్యాన్ని అధిగమించి ఆదాయం వచ్చింది. ఈ నెల 27న 46,576 మంది ప్రయాణికులు 33 వేల కిలోమీటర్లు ప్రయాణించగా రూ.23.09 లక్షలు, ఈ నెల 28న 55,838 మంది ప్రయాణికులు 36 వేల కిలోమీటర్లు ప్రయాణించగా రూ.27.30 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. రాఖీ పండుగకు రెండురోజుల ముందు నుంచి తోబుట్టువులు తమ సొంతూళ్ల బాట పట్టారు. శుక్రవారం కూడా ప్రయాణం చేయడంతో రద్దీ కొనసాగింది. శని, ఆదివారాల్లో కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
28న డిపోల వారీగా ఆదాయం


