ఆధ్యాత్మిక బాటలో వెలుగు దివ్వె..! | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక బాటలో వెలుగు దివ్వె..!

Aug 29 2026 11:57 PM | Updated on Aug 29 2026 11:57 PM

మానవ సేవే మాధవ సేవ అని చాటిన మహనీయుడు భక్తులకు మార్గదర్శకంగా నిలిచిన పూలాజీబాబా నేడు పట్నాపూర్‌లో జయంతి వివిధ ప్రాంతాల నుంచి తరలిరానున్న భక్తులు

కెరమెరి: ‘అనంత విశ్వంలో మనమున్నాం.. మనలోనూ విశ్వం దాగి ఉంది.. పంచభూతాల నిలయమే మానవ దేహం.. అదే ఈశ్వర తత్త్వం.. ఈ దేహమే దేవాలయం.. జీవుడే దేవుడు’ అంటూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయుడు సంత్‌ శ్రీ పూలాజీ బాబా. జైనూర్‌ మండలం పట్నాపూర్‌లో ‘శ్రీ సిద్ధ్‌ మహాయోగ పీఠం నెలకొల్పి ఆధ్యాత్మికతను విస్తరించారు. పూలాజీ బాబా 1925 ఆగస్టు 30న మహారాష్ట్రలోని పర్భణి జిల్లా ఔండ్‌ నాగనాథ్‌ తాలూకా సావళి (బాయనరావు)గ్రామంలో పుంజా బాయి–దోండోబా ఇంగ్లే దంపతులకు జన్మించారు. 1945లో ఆ కుటుంబం జీవనోపాధి కోసం పట్నా పూర్‌కు వలసవచ్చి స్థిరపడింది. బాబా తల్లి పుంజా బాయి గొప్ప భక్తురాలు. భజనలు, పూజలు, సత్సంగాలతో ఆధ్యాత్మిక సాధన చేసేవారు. తల్లి బోధనలు, గురూజీ గణపతి వాడ్గురే సహవాసం పూలాజీ బాబాలోని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మేల్కొలిపాయి. ‘పరమయోగి పరమహంస’గా భక్తుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న పూలాజీ బాబా 2018 డిసెంబర్‌ 25న తనువు చాలించారు. ఆయన ప్రేరణతో 350కుపైగా ధ్యాన కేంద్రాలు ఏర్పడ్డా యి. ఆదివారం పట్నాపూర్‌లో బాబా జయంతి వేడుకలకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

పంచాగ్ని యోగా సాధన

సాధారణ జీవితాన్ని త్యజించి బాబా మలెంగి తపోవనంలో చాలాకాలం పాటు పంచాగ్ని యోగా సాధన చేసినట్లు తెలుస్తోంది. వేదాలు, ఉపనిషత్తులు, ఆధ్యాత్మిక గ్రంథాలను లోతుగా అధ్యాయనం చేసి యోగిగా పరిణతి చెందారు. బోధనలతో సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించారు. కోటీశ్వరుల నుంచి కటిక పేదల వరకు ఎంతోమంది బోధనలతో ప్రభావితమై తమ జీవితాలను మార్చుకున్నారు. చెడు అలవాట్లకు దూరమై మద్యం, మాంసాహార వినియోగాన్ని విడిచిపెట్టిన వారెందరో ఉన్నారు. ‘మానవ సేవయే మాధవ సేవ’ అనే భావనతో ఆయన సాగించిన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని అనేక గ్రామాల్లో వేలాది మంది భక్తులు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. ప్రతీరోజు ఆయా కేంద్రాల్లో పూజలు, భజనలు చేస్తారు.

మూడు రాష్ట్రాల నుంచి భక్తులు రాక..

పట్నాపూర్‌లో ఆదివారం నిర్వహించనున్న పూలాజీబాబా జయంతి వేడుకలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆలిండియా ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ శివాజీరావు మోగే, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల కలెక్టర్‌లు హరిత, రాజర్షిషా, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు, ఎస్పీ నితిక పంత్‌, ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఎంపీ గోడం నగేశ్‌, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జుపటేల్‌, అనిల్‌ జాదవ్‌, కిన్వట్‌ ఎమ్మెల్యే కేరాం భీంరావు తదితరులు హాజరుకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement