పర్యావరణ సమతుల్యతకు నిదర్శనం పెద్దపులి జిల్లాలో మనుగడ కోసం పోరాటం తగ్గుతున్న సహజ ఆవాసాలు, ఆహార లభ్యత నేడు ప్రపంచ పులుల దినోత్సవం
చింతలమానెపల్లి: పర్యావరణ సమతుల్యతకు పెద్దపులిని నిదర్శనంగా చెబుతున్నారు. ఈ మృగాలు మనుగడ సాగించిన చోట అడవులు, వన్యప్రాణులు సమృద్ధిగా ఉన్నట్లుగా పర్యావరణవేత్తలు పరిగణిస్తారు. అడవికి రారాజుగా వెలుగొందే పులులు ప్రస్తుతం ఆవాసం కోసం పోరాటం సాగిస్తున్నాయి. తాడోబా అభయారణ్యం, కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టుకు కీలక వారధిగా ఉన్న జిల్లా అడవుల్లో మనుషుల సంచారం, పోడు సాగు, ఆవాసాలు విచ్ఛిన్నం కావడం పులుల ఉనికిని దెబ్బతీస్తున్నాయి. ఆసిఫాబాద్ డివిజన్‌లో పులుల స్థిర నివాసాలు లేకున్నా తాడోబా నుంచి కవ్వాల్ అభయారణ్యానికి రాకపోకలు సాగించడానికి అత్యంత కీలకం. కాగజ్‌నగర్ డివిజన్‌లోని సిర్పూర్(టి), పెంచికల్‌పేట్, కాగజ్‌నగర్ రేంజ్‌ల్లో పులులు కొంతకాలంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయని అధికారులు ధ్రువీకరిస్తున్నారు. పెద్దపులుల సంరక్షణపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 29న ప్రపంచ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం పలు అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నారు. బెబ్బులి దాడుల్లో పశువుల కోల్పోయిన బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి మొక్కలు నాటడంతో పాటు, పులులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేక భావనను తొలగించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఆహార కొరత.. తగ్గిన కదలికలు
అడవులలో శాకాహార జంతువులను విచ్చలవిడిగా వేటాడటంతో పులులకు తీవ్ర ఆహార కొరత ఏర్పడుతోంది. ప్రధాన ఆహారమైన దుప్పులు, జింకలు, అడవి పందులను కొంతమంది వేటగాళ్లు ఉచ్చులు వేసి హతమారుస్తున్నారు. ఎర జంతువుల సంఖ్య తగ్గడంతో పులులు శివారు గ్రామాల్లోకి వచ్చి పశువులపై దాడులు చేస్తున్నాయి. వేటగాళ్లపై ఐదేళ్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఆహార కొరత, ఆవాసాలు తగ్గడం, ఇతర కారణాలతో జిల్లాలో పులుల కదలికలు తగ్గినట్లు తెలుస్తోంది. అడవుల్లో నిరంతరం శబ్దాలు, పెరిగిన మానవ సంచారం, సరిహద్దుల వద్ద రక్షణ లోపించడంతో పులులు మహారాష్ట్రలోని తాడోబాకు తిరిగి వెళ్తున్నట్లు సమాచారం.
అటవీశాఖ ఆధ్వర్యంలో చర్యలు
పులుల ఉనికిలో జిల్లాకు ఉన్న ప్రాధాన్యతను అటవీశాఖ గుర్తించి అడవులు, పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటోంది. గడ్డి మైదానాలను పెంచడంతో పాటు సహజ నీటి వనరుల సంరక్షణకు చర్యలు చేపట్టడంతో శాకాహార జంతువుల సంఖ్య పెరిగింది. ఇటికలపహాడ్, దిందా, గూడెం తదితర ప్రాంతాలలో భారీ ఎత్తున ఆక్రమణకు గురైన అటవీ, పోడు భూములను స్వాధీనం చేసుకుని అడవులను తిరిగి అభివృద్ధి చేస్తోంది.
దెబ్బతింటున్న సహజ ఆవాసాలు
కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ డివిజన్లలోని 10 రేంజ్‌ల పరిధిలో 2,437 చదరపు కిలోమీటర్ల మేర అడవులు విస్తరించి ఉన్నాయి. అంకుసాపూర్, సిర్పూర్(టి) రేంజ్, కడంబా అడవుల్లో గతంలో పులులు శాశ్వత ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. దాదాపు 11 వరకు ఇక్కడే సంచరించేవి. ఒక పెద్దపులి సంచరించడానికి 80 నుంచి 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అవసరం. అటవీ సరిహద్దులు, అటవీ ప్రాంతాల్లో విస్తరిస్తున్న పోడు సాగు కారణంగా అడవులు ముక్కలవుతున్నాయి. సహజ వనరులు దెబ్బతినడంతో వాటి మనుగడకు విఘాతం కలుగుతోంది. అలాగే వేటగాళ్లు ఈ జంతువులను హతమారుస్తున్నారు. పెంచికల్‌పేట్ పరిధిలోని కే8 పులిని వేటగాళ్లు హతమార్చగా, 34 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. వాంకిడి మండల పరిధిలోని షెర్కపల్లి అడవుల్లో రెండు పులులు, రైలు ప్రమాదంలో మరో పులి మృతి చెందగా, మరికొన్ని పులులు మహారాష్ట్రకు వలస వెళ్లాయి. ప్రస్తుతం జిల్లాలో మూడు పులులు మాత్రమే ఉన్నట్లు అనధికారిక అంచనా.


