కాజీపేట, బల్లార్షా మూడో రైల్వే లైన్ ప్రారంభం ఇటీవల ఆసిఫాబాద్‌రోడ్– కాగజ్‌నగర్ మధ్య సామర్థ్య పరీక్షలు వేగవంతమైన ప్రయాణానికి అవకాశం
కాగజ్‌నగర్‌టౌన్: దక్షిణ మధ్య రైల్వేకు ప్రతిష్టాత్మకమైన కాజీపేట – బల్లార్షా మధ్య 203 కిలోమీటర్ల మూడో రైల్వే లైన్ ప్రాజెక్టు పూర్తయ్యి అందుబాటులోకి వచ్చింది. సుమారు రూ.3000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ దేశంలోని ప్రధాన ఉత్తర, దక్షిణ గ్రాండ్ ట్రంక్ రైల్ కారిడార్‌కు కొత్త ఊపునిచ్చింది. ఈ నెల 22న ఆసిఫాబాద్‌రోడ్– సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య 11 కిలోమీటర్ల సెక్షన్‌తోపాటు విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయి. దీంతో ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.
దశలవారీగా పనులు
2015– 16లో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ట్రిప్లింగ్ పనులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును మూడు విడతలుగా చేపట్టారు. 2016లో రాఘవాపురం– మందమర్రి మధ్య 33 కిలోమీటర్లు పూర్తి కాగా, 2020 నుంచి మిగిలిన సెక్షన్లు పనులు కొనసాగాయి. తాజాగా ఆసిఫాబాద్ రోడ్– కాగజ్‌నగర్ మధ్య పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తికావడంతో ట్రాక్ వేగ సామర్థ్యాన్ని పరీక్షించారు. కాగా, నిజాం సర్కార్ 1947 ముందు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం బీబ్రా కేంద్రంగా పరిపాలన కొనసాగించారు. నిజాం సర్కార్ హయాంలో పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మించగా దానికి బీబ్రా వంతెనగా నామకరణం చేశారు. అప్పటి నుంచి దీనిని బీబ్రా బ్రిడ్జిగానే పిలుస్తున్నారు.
రైళ్ల ఆలస్యానికి చెక్
ఈ నెల 24న దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్.గోపాల కృష్ణన్ ప్రత్యేక రైలులో ట్రిప్లింగ్ లైన్‌ను బల్లార్షా వరకు పర్యవేక్షించారు. కాజీపేట– బల్లార్షా సెక్షన్ ఉత్తర, దక్షిణ భారతాన్ని కలిపే ప్రధాన కారిడార్. ఇక్కడ బొగ్గు, సిమెంట్ వంటి భారీ సరుకు రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు రోజు వేల సంఖ్యలో తిరుగుతాయి. తీవ్ర రద్దీ ఉండేది. మూడో లైన్‌తో లైన్ సామర్థ్యం పెరిగి రైళ్ల ఆలస్యం తగ్గుతుంది. ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లు వేగంగా నడిచే అవకాశం ఏర్పడుతోంది. థర్మల్ పవర్‌ప్లాంట్, పరిశ్రమలకు బొగ్గు, సిమెంట్ సరఫరా సాఫీగా జరగనుంది.


