పశువులకు టీకా అభయం | - | Sakshi
Sakshi News home page

పశువులకు టీకా అభయం

Mar 13 2026 7:41 AM | Updated on Mar 13 2026 7:41 AM

కొనసాగుతున్న గాలికుంటు నివారణ టీకాల పంపిణీ ఏప్రిల్‌ 9 వరకు కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని వైద్యుల సూచన జిల్లాలో 3,39,200 పశువులు

కౌటాల: జిల్లాలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్‌ 9 వరకు నెల రోజుల పాటు పశువులకు టీకాలు వేయనున్నారు. వేసవి నేపథ్యంలో ఉద యం 6 గంటల నుంచి చల్లదనాన్ని బట్టి ఉదయం 11 గంటల వరకు టీకాలు వేస్తున్నారు. పాడిరైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థక శాఖ అధికారులు సూచిస్తున్నారు.

వ్యాధి లక్షణాలు ఇవే..

సాధారణంగా గాలికుంటు వ్యాధి సోకిన గేదెలు, ఆవులు 24 గంటలోపు బక్కచిక్కి అల్సర్‌ బారిన పడతాయి. రెండు నుంచి ఆరు రోజుల వరకు జ్వరం ఉంటుంది. నోరు, పెదాలు, నాలుక, చన్నులు, కాలి గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. మేత, నీళ్లు సరిగా తీసుకోవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి మూగజీవాలు చనిపోయే ప్రమాదం ఉటుంది. వైద్యుల సూచనల మేరకు వ్యాధి సోకిన పశువులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలి. నోరు, పెదాలు, నాలుక, కాళ్ల గిట్టల వద్ద ఉన్న పుండ్లను పొటాషియం పర్మాంగనేట్‌, నార్మల్‌ సైలెన్‌ వాటర్‌తో శుభ్రం చేయాలి. మరోసారి ఇన్‌ఫెక్షన్‌ బారినపడకుండా యాంటీ బయాటిక్స్‌, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి బీ కాంప్లెక్స్‌ మందులను వాడాల్సి ఉంటుంది. వ్యాధి సోకిన పశువులను ఇతర వాటితో కలిసి ఒకేచోట ఉంచొద్దు. అలాగే ఎప్పటికప్పుడు కొట్టాన్ని శుభ్రం ఉంచాలి. వారానికి ఒకసారి సున్నం చల్లి, క్రిమికీటకాల నివారణకు చర్యలు తీసుకోవాలి. వ్యాధి సోకిన గేదె, ఆవు నుంచి తీసిన పాలను 100 డిగ్రీల సెల్సియస్‌ వరకు వేడి చేసిన తర్వాతే వినియోగించాలి. వ్యాధి సోకిన పశువు చనిపోతే తప్పనిసరిగా బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లి గోతిలో పాతిపెట్టాలి.

సద్వినియోగం చేసుకోవాలి

రైతులు పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. మంగళవారం నుంచి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ప్రారంభించాం. షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 9 వరకు అన్ని గ్రామాల్లోని పశువులకు ఉచితంగా టీకాలు అందిస్తాం. టీకాలు వేయించడం ద్వారా మూగజీవాలు ఆరోగ్యంగా ఉంటాయి. పశు పోషకులు ఈ అవకాశాన్ని స్వదినియోగం చేసుకోవాలి. మేకలు, గొర్రెలు, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకినా సిబ్బందికి సమాచారం అందించాలి.

– సురేశ్‌, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి

ఏటా రెండుసార్లు

గాలికుంటు వ్యాధిపై నిర్లక్ష్యం వహించకుండా క్రమం తప్పకుండా ఏడాదికి రెండుసార్లు టీకాలు వేయించాలి. ప్రాణాంతకమైన వ్యాధి కావడంతో చిన్నపాటి అలసత్వం చేసినా మూగజీవాలు మృత్యువాత పడే అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమతో ఉపాధి పొందుతున్న రైతులు నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏటా రెండుసార్లు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పంపిణీ చేస్తున్నాయి. జిల్లాలో రెండు ఏరియా పశువైద్యశాలలు ఉండగా 19 ప్రాథమిక పశువైద్యశాలలు ఉన్నాయి. ఏడు సబ్‌ సెంటర్లు ఉన్నాయి. జిల్లాలో ఈ నెల 10వ తేదీ నుంచి ఏప్రిల్‌ 9వ తేదీ వరకు గాలికుంటు నివారణ టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. జిల్లాలో ఆవులు, గేదెలు కలిపి 3,39,200 వరకు ఉన్నాయి. గ్రామాల వారీగా షెడ్యూల్‌ ప్రకారం ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు సిబ్బంది టీకాలు వేస్తున్నారు. పశువులను ఇంటి వద్ద ఉంచి టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement