ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతోనే గ్రామాలు, పట్టణాల అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ కె.హరిత అన్నా రు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతి, మున్సిపల్ చైర్‌పర్సన్లు మెంగ్రె ఆకాశ్, షాహిన్ సుల్తానాతో కలిసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచులు, కౌన్సిలర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధులతో తమ పరిధిలోని పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటికి ప్రాధాన్య త ఇవ్వాలన్నారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రణాళికలు రూపొందించాలని, భూగర్భ జలాలు పెంచేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని, నీటి పొదుపు ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్ర త, మహిళల ఆరోగ్యం, సురక్షిత ప్రయాణం, సంక్షేమ పథకాల అమలు, చిన్నారుల భద్రత, మాదకద్రవ్యాల కట్టడి, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, పాఠశాలల్లో వసతుల కల్పన, యువజన క్రీడలు, సేవలు, మహిళల సంక్షేమం, పర్యావరణ రక్షణ వంటి పది అంశాలపై ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.
అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు అందాలి
అన్నివర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని సూచించారు. విద్యాలయాలను ఏకీకృతం చేసేందుకు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులం నిర్మిస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ముందుగా ప్రాధాన్యత గల పనులు చేపట్టాలన్నారు. మిషన్ భగీరథ పథకం కింద ప్రతీ ఇంటికి నీటిని సరఫరా చేయాలని సూచించారు. కాగా, ఉదయం ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఆరోగ్య సమస్యలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. మధ్యాహ్నం మహిళల సంక్షేమం, బాల్య వివాహాల నిషేధం, మహిళల ఆరోగ్యం, మహిళా సాధికారత, పేదరిక నిర్మూల న, ఉపాధి కల్పన, అందరికీ విద్య, ఇతర శాఖల సంబంధిత కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన చర్చ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సందేహాల ను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీఆర్‌డీవో దత్తారావు, డీటీడీవో రమాదేవి, డీఎంహెచ్‌వో సీతారాం తదితరులు పాల్గొన్నారు.


