తారాస్థాయికి మున్సిపల్‌ ప్రచారం | - | Sakshi
Sakshi News home page

తారాస్థాయికి మున్సిపల్‌ ప్రచారం

Feb 9 2026 7:30 AM | Updated on Feb 9 2026 7:30 AM

తారాస్థాయికి మున్సిపల్‌ ప్రచారం

తారాస్థాయికి మున్సిపల్‌ ప్రచారం

● గడపగడపకూ అభ్యర్థులు ● పాటలతో హోరెత్తిస్తున్న మైకులు ● నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

ఆసిఫాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం జిల్లాలో తారాస్థాయికి చేరింది. ప్రచారానికి కేవలం ఒకే రోజు మిగిలి ఉండడంతో రాజకీయ పార్టీలు ప్రచార స్పీడు పెంచాయి. పక్కా ప్రణాళికతో ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు పుర ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండగా, బీఆర్‌ఎస్‌, బీజేపీ సత్తా చాటుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. చైర్మన్‌ పీఠాలను కై వసం చేసుకోవడం లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జిల్లాస్థాయి నాయకులు ఇంటింటికీ ప్రచారం కొనసాగిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కాలనీల్లో పలుకుబడి ఉన్న నాయకులతో ప్రచారం చేస్తున్నారు. పరస్పర విమర్శలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు జిల్లా ఇన్‌చార్జీలను నియమించి, రోజూవారీగా బలబలాల తీరుపై అంచనా వేస్తున్నారు. వార్డుల్లో మందు, విందుతో పాటు ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఆదివారం కొన్ని వార్డుల్లో అల్పహారంతో పాటు భోజనాలు ఏర్పాటు చేసి, ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అంతర్గత పొత్తులపై దృష్టి

జిల్లాలో ఆసిఫాబాద్‌లో 20, కాగజ్‌నగర్‌లో 30 వా ర్డులున్నాయి. ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్‌ 19, బీఆర్‌ఎ స్‌ 20, బీజేపీ 18, జనసేన 8, బీఎస్పీ 3, సీపీఎం 1 తో పాటు 22 మంది స్వతంత్రులు బరిలో ఉండగా, కాగజ్‌నగర్‌లో బీజేపీ 30, బీఆర్‌ఎస్‌ 30, కాంగ్రెస్‌ 29, బీఎస్‌పీ 8, జనసేన 2 స్థానాలతో పాటు 23 మంది స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలకు సంబంధం లేకుండా చైర్మన్‌కు స్ప ష్టమైన మెజార్టీరాని పక్షంలో తీసుకునే నిర్ణయాలపై గుట్టుగా సంప్రదింపులు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపల్‌ చైర్మన్‌తో పాటు వైస్‌ చైర్మన్‌ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది.

అభ్యర్థుల్లో టెన్షన్‌

పోలింగ్‌ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. ఈ నెల 11న మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తుండగా, అంతకు ముందు 48 గంటల ముందు నుంచి ప్రచారానికి తెరపడనుంది. ప్రచారానికి కేవలం 24 గంటలే సమయం ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. ఓటర్లకు గాలం వేసేందుకు ప్రధాన పార్టీలు ఒక్కో వార్డుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేసుకున్నాయి. పోటాపోటీగా ప్రచారంతో పాటు నజరానాలు, తాయిలాల పంపిణీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచే మద్యం దుకాణాలు మూసి వేయనుండడంతో అభ్యర్థులు మద్యం సమకూర్చుకుంటున్నారు. గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను ఇక్కడికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక ప్రచార రథాలతో కాలనీలు మైకులతో హోరెత్తిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement