ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహిస్తాం
కాగజ్‌నగర్‌రూరల్: మున్సిపల్ ఎన్నికలను సమర్ధవంతంగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తిరుపతి పేర్కొన్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చామన్నారు. పోలింగ్‌కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్ని వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ‘సాక్షి’కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రశ్న: పోలింగ్ బూత్‌లలో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు.
కమిషనర్: ఓటర్లకు మంచినీరు, టెంట్, విద్యుత్ సౌకర్యాలను కల్పించాం. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించాం. దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతీ పోలింగ్ కేంద్రంలో ముగ్గురు సభ్యులకు అదనంగా డ్యూటీలు కేటాయించాం.
ప్రశ్న: ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బందికి శిక్షణ ఇచ్చారా?
కమిషనర్: ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బందికి శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించాం.
ప్రశ్న: ఎన్నికల కోడ్ ఉల్లంఘన, బెల్ట్‌షాపుల నిర్వహణపై ఏమైనా నిఘా పెట్టారా?
కమిషనర్: ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ప్రత్యేక నిఘా పెట్టాం. బెల్ట్‌షాప్‌లను నివారించేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశాం.
ప్రశ్న: అభ్యర్థుల ఖర్చుల వివరాల కోసం ప్రత్యేకంగా ఏమైనా బృందాలను కేటాయించారా?
కమిషనర్: కౌన్సిలర్ అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు ప్రత్యేకంగా ఆరుగురు సభ్యులతో ఒక టీం ఏర్పాటు చేసి నిఘా పెట్టాం.
ప్రశ్న: ఎన్నికల నిర్వహణ కోసం ఎంతమంది సిబ్బందిని కేటాయించారు.
కమిషనర్: ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించేందుకు 85 మంది పోలింగ్ అధి కారులతో పాటు ఒక్కో కేంద్రంలో మరో ముగ్గురు సిబ్బందిని కేటాయించాం. సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశాం.
ప్రశ్న: పట్టణంలో సమస్యాత్మక ప్రాంతాలపై మీ వైఖరి ఏంటి?
కమిషనర్: పట్టణంలో ఉన్న సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి పోలీసు ల సహకారంతో ఆయా ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహిస్తున్నాం. రాత్రిళ్లు కూడా నిఘా పెట్టి అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. పోలింగ్ రోజు మరింత కట్టుదిట్టం చేస్తాం.
ప్రశ్న: పట్టణంలో ఎన్ని వార్డులు ఉన్నాయి. ఎన్ని పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు.
కమిషనర్: పట్టణంలో 30 వార్డులు ఉండగా, 85 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశాం.
ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహిస్తాం


