సమయపాలన పాటించకుంటే చర్యలు
ఆసిఫాబాద్: సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తప్పవని కలెక్టర్ కె.హరిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సముదా యంలో గల పలు ప్రభుత్వ కార్యాలయాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆబ్కారీ, పౌర సరఫరాలు, వ్యవసాయ, భూగర్భజలాలు, మత్స్య, వైద్యారోగ్య, విద్య, భూకొలతల శాఖల కార్యాలయాలను సందర్శించారు. హాజరు రిజిస్టర్లు పరిశీ లించి గైర్హాజరైన సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారని అధికారులు వివరించారు. హాజరైన అధికారులు సైతం రిజిస్టర్‌లో సంతకం చేయకపోవడాన్ని గుర్తించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగై న సేవలందించేందుకు అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఇక నుంచి విధులకు హాజరు కాని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రెయినీ ఐఎఫ్‌ఎస్ అధికారి భార్గవ్‌కుమార్ ఉన్నారు.
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలి
మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో ఉంటాయని, ప్రతీ అంశంపై అవగహన ఉండాలన్నారు. పీవో డైరీలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నమోదు చేయాలని, రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని జోనల్ అధికారులకు నివేదించాలని ఆదేశించారు. సామగ్రి, బ్యాలెట్ పత్రాలను సరిచూసుకోవాలన్నారు. కార్యక్రమంలో సాధారణ ఎన్నికల పరిశీలకుడు అలోక్‌కుమార్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ట్రెయినీ ఐఎఫ్‌ఎస్ అధికారి భార్గవ్‌కుమార్, పీవోలు, ఏపీవోలు, మాస్టర్ ట్రైయినర్లు పాల్గొన్నారు.


