మనమే టాప్..
ఉత్పత్తిలో దూసుకుపోతున్న బెల్లంపల్లి ఏరియా
వార్షిక లక్ష్యసాధన వైపు వేగంగా అడుగులు
బొగ్గు రవాణాలోనూ నూతన రికార్డులు
రెబ్బెన: బొగ్గు ఉత్పత్తిలో బెల్లంపల్లి ఏరియా దూసుకుపోతోంది. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలు ఉండగా ‘బెల్లంపల్లి’ లక్ష్య సాధనలో ముందుంది. మరోవైపు బొగ్గు రవాణాలోనూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 54 రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. వార్షిక లక్ష్యం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. గడిచిన ఐదేళ్లలో ఏరియా ఒక్కసారి మాత్రమే వందశాతం వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించగా.. గతేడాది కేవలం 3 శాతం తగ్గింది. కానీ ఈసారి ఎలాగైనా లక్ష్యాన్ని అధిగమించాలని సింగరేణి అధికారులు చర్యలు చేపడుతున్నారు.
పెరుగుతున్న ఉత్పత్తి
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అర్ధ వార్షికం వరకు ఉత్పత్తి మందగించినా.. ఆ తర్వాత నాలుగు నెలలుగా బెల్లంపల్లి ఏరియా ఉత్పత్తిలో ముందు వరుసలో ఉంది. ఏరియాలో ప్రస్తుతం ఖైరిగూర ఓసీపీలో మాత్రమే ఉత్పత్తి కొనసాగుతోంది. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా మిగిలిన ప్రాంతాలతో పోల్చితే బెల్లంపల్లి ఏరియాలోని బొగ్గు గనుల ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా నమోదవుతుంది. గతేడాదితో పోల్చితే ఈసారి అత్యధికంగా వర్షాలు పడ్డాయి. దాదాపు 50 రోజులకు పైగా ఉత్పత్తి ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏరియా వార్షిక ఉత్పత్తి లక్ష్యం 35 లక్షల టన్నులుగా నిర్ణయించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వర్షాకాలంలో ఉత్పత్తి లక్ష్యం కాస్త తగ్గించి.. మిగిలి న కాలంలో పెంచుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. వర్షాలు పడే నాలుగు నెలలు నెలవారీ లక్ష్యాన్ని 2 లక్షలు, మిగిలిన నెలల్లో 3.5లక్షలుగా నిర్ణయించారు. అయితే సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నెలలో కేవలం 37 శాతం ఉత్పత్తి సాధించగలిగారు. తర్వాత నుంచి వానలు తగ్గుముఖం పట్టడంతో వేగం పెంచారు. అక్టోబర్ నుంచి జనవరి వరకు ప్రతినెలా వందశాతం లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ప్రారంభంలో వార్షిక ఉత్పత్తి సాధన 87 శాతం ఉండగా.. ప్రస్తుతం 96 శాతం ఉంది.
రవాణాలో భేష్
బెల్లంపల్లి ఏరియా బొగ్గు ఉత్పత్తితోపాటు రవాణాలోనూ భేష్ అనిపించుకుంటోంది. రవాణాలో గుండెకాయగా మారిన గోలేటి సీహెచ్‌పీ రికార్డులు నమోదు చేస్తోంది. బెల్లంపల్లి ఏరియా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనవరి 28న ఒక్కరోజే ఏకంగా ఆరు రేకుల (24,014 టన్నులు) బొగ్గు రవాణా చేసి కొత్త రికార్డు నెలకొల్పారు. ఏరియా గరిష్ట బొగ్గు రవాణా ఇప్పటి వరకు కేవలం 5 రేకులు మాత్రమే. ఇప్పటికే గోలేటికి కంపెనీ వ్యాప్తంగా ఉత్తమ సీహెచ్‌పీగా పేరుంది. తాజాగా మరోసారి రికార్డులకెక్కింది. ఖైరిగూర ఓసీపీలో ఉత్పత్తి అవుతున్న బొగ్గును యాజమాన్యం లారీల ద్వారా గోలేటి సీహెచ్‌పీ వరకు సరఫరా చేశారు. అక్కడి నుంచి రైలుమార్గం ద్వారా వినియోగదారులకు సకాలంలో నాణ్యమైన బొగ్గును తరలిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బెల్లంపల్లి ఏరియా 27,91,337 టన్నుల బొగ్గును సరఫరా చేసింది.
2025–26లో బెల్లంపల్లి బొగ్గు
ఉత్పత్తి వివరాలు (లక్షల టన్నుల్లో)
నెల టార్గెట్ సాధించింది శాతం
ఏప్రిల్ 3.50 2.74 78
మే 3.50 3.04 87
జూన్ 2.00 2.62 131
జూలై 2.00 2.00 100
ఆగస్టు 2.00 1.36 68
సెప్టెంబర్ 2.00 0.74 37
అక్టోబర్ 3.00 3.03 101
నవంబర్ 3.50 3.53 101
డిసెంబర్ 3.50 3.92 112
జనవరి 3.50 4.30 123
ఐదేళ్లలో ఏరియా సాధించిన
వార్షిక ఉత్పత్తి(లక్షల టన్నుల్లో)
సంవత్సరం టార్గెట్ సాధించింది శాతం
2021–22 33.50 24.42 73
2022–23 35.00 29.20 83
2023–24 36.50 37.50 103
2024–25 38.50 37.50 97
2025–26 35.00 27.29 96
(ఏప్రిల్ నుంచి జనవరి వరకు)


