గ్రామానికో సమైక్య భవనం
జిల్లాకు 222 పక్కా భవనాలు మంజూరు పలుచోట్ల నిర్మాణ పనులు షురూ మార్చి 31లోగా పనులు పూర్తిచేసేలా ప్రణాళిక మహిళా సంఘాల సమావేశాల నిర్వహణకు వినియోగం
కెరమెరి: స్వయం సహయక మహిళా సంఘాలకు గ్రామాల్లో ప్రత్యేక భవనాల నిర్మాణానికి ప్రభుత్వం పక్కా భవనాలు మంజూరు చేసింది. వీబీ జీ రామ్ జీ(జాతీయ ఉపాధి హామీ పథకం) నిధులతో ఒక్కో భవన నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించింది. పొదుపు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో వర్క్ షెడ్లుగా, మహిళా సంఘాల అవసరాలకు వినియోగించనున్నారు. వర్క్ షెడ్లలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్‌లు కుట్టడం, సమావేశాలు, శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగించనున్నారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు సొంత భవనాలు లేకపోవడంతో గ్రూపు సభ్యుల ఇంటి వద్ద, ఆరు బయట, చెట్ల కింద సమావేశాలు నిర్వహించుకుంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్కా భవనాలతో వారి సమస్య పరిష్కారం కానుంది. మార్చి 31 నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది.
స్థలాల ఎంపికకు తీర్మానం
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 386 వీవోలు ఉన్నాయి. 885 ఎస్‌హెచ్‌సీల పరిధిలో 93,895 మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇందులో 222 వీవోలకు పక్కా భవనాలు మంజూరయ్యాయి. గ్రామైక్య సంఘాల భవనాల కోసం స్థలాల ఎంపిక దాదాపుగా అన్ని మండలాల్లో పూర్తయ్యింది. సొంత భవనాల నిర్మాణం కోసం స్థలాల కోసం పంచాయతీలు తీర్మానం చేసి మండల పరిషత్ ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖ పంపించాయి. ప్రభుత్వ స్థలాలు, శిఖం భూములు, దాతలు అందించే స్థలాలను గుర్తించారు. స్థలాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పంచాయతీ భవనాలపైన మొదటి అంతస్తుగా నిర్మించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 240 నుంచి 300 గజాల వరకు స్థలాలను కేటాయించాలని సూచించింది. ఇప్పటికే పలుచోట్ల భూమిపూజ కూడా చేశారు.
మండలాల్లో ఆహార నిల్వ కేంద్రాలు
గ్రామీణ సమాఖ్య భవనాలతోపాటు 15 మండలాల్లో ఆహార నిల్వ కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. రైతులు పండించిన పంటలను ఈ కేంద్రాల్లో భద్రపర్చుకోవచ్చు. బియ్యం, పప్పులు పాడవకుండా నిల్వ చేయడమే ప్రధాన ఉద్దేశ్యం. తేమ లేని వాతావరణం, పురుగు మందు వినియోగం ద్వారా నష్టాన్ని తగ్గించాలని ఒక్కో మండలానికి ఒక భవనం మంజూరు చేశారు. నిర్మాణానికి ఒక్కో భవనానికి రూ.30 లక్షలు కేటాయించారు. కానీ ఇప్పటివరకు ఎక్కడా స్థల సేకరణ పూర్తి కాలేదని తెలుస్తోంది. ఆసిఫాబాద్ మండలంలో రౌట సంకేపల్లి గ్రామం పంచాయతీలో ఆహార నిల్వ కేంద్రం నిర్మించనుండగా.. కాగజ్‌నగర్‌లో జగన్నాథ్‌పూర్, పెంచికల్‌పేట్‌లో బొంబాయిగూడ, రెబ్బనలో గంగాపూర్, తిర్యాణిలో గోయగాం పంచాయతీల్లో నిర్మిస్తుండగా, మిగిలిన పది మాత్రం మండల కేంద్రాల్లోనే నిర్మించనున్నారు. వీటికి జిల్లాలో మొత్తం రూ.4.50 కోట్ల ఉపాధిహామీ నిధులు వెచ్చించనున్నారు.
ఎంతో ఉపయోగకరం
జిల్లాలో 222 గ్రామ సంఘాలకు, 15 మండలాల్లో ఆహా ర నిల్వ కోసం పక్కా భవనాలు మంజూరయ్యాయి. గ్రామ సంఘ భవనాల్లో మ హిళలు సమావేశాలు, కుట్లు ఇతర పనులు నిర్వహించుకోవచ్చు. రైతులు పండించిన ఆహార ధా న్యాల నిల్వ కోసం ఆహార నిల్వ కేంద్రాలను విని యోగించుకోవచ్చు. మార్చి 31 లోగా పూర్తి చేయాలని ఆదేశించాం. – దత్తారావు, డీఆర్‌డీవో
గ్రామానికో సమైక్య భవనం


