ప్రచారం.. పరుగు
ఎన్నికల సమయంలో ఒక్కటైన కాంగ్రెస్ నేతలు
రంగంలోకి దిగిన బీఆర్‌ఎస్, బీజేపీ ముఖ్య నేతలు
ఊపందుకున్న మున్సిపల్ ప్రచారం
ఇంటింటా ప్రచారం చేస్తున్న
బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
జిల్లా కేంద్రంలోని ఆరోవార్డులో
ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు
వార్డు నం.16లో మాట్లాడుతున్న
ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు
ఆసిఫాబాద్: బరిలో ఉన్న అభ్యర్థులు తేలడంతో మున్సిపల్ ప్రచార వేడి పెరిగింది. నేతలు పట్టణాల్లోని ప్రతీ కాలనీకి.. గడపగడపకూ వెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ తరుణంలో ఇన్నాళ్లూ అంటిముట్టనట్లు ఉన్న నేతలు కూడా పార్టీ గెలుపు కోసం ఒకటవుతున్నారు. కలహాలు పక్కన పెట్టి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుతూ ప్రచారం చేస్తున్నారు.
చేతులు కలిపిన
కాంగ్రెస్ నేతలు
తొలిసారి ఎన్నికలు జరిగే జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌పై పట్టు నిలుపుకొనేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో నిన్నమొన్నటి వరకు ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా ఉన్న జిల్లా కాంగ్రెస్ నేతలు మున్సిపల్ ఎన్నికల వేళ ఒక్కటై ప్రచారం చేస్తున్నారు. బుధవారం అధికార పార్టీ నేతలు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, ఇతర నేతలు జన్కాపూర్, దస్నాపూర్, బజార్‌వాడీతోపాటు పలు కాలనీల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ముఖ్య నేతలంతా కలిసి ప్రచారంలో పాల్గొనడం స్థానిక కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది.
రంగంలోకి ముఖ్యనాయకులు
కాగజ్‌నగర్‌రూరల్: ఎన్నికలు సమీపిస్తుండడంతో తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు ముఖ్యనాయకులు రంగంలోకి దిగారు. కాగజ్‌నగర్ పట్టణంలో బుధవారం అన్ని పార్టీల నుంచి నేతలు ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేశారు. ఓటర్లతో అప్యాయంగా మాట్లాడుతూ ఓట్లు అభ్యర్థించారు. రెండు రోజుల క్రితం మెదక్ ఎంపీ రఘునంద్‌నావు, ఆధ్యాత్మిక వేత్త రాధామనోహర్‌దాస్‌లు కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ప్రచార సభల్లో పాల్గొన్నారు. గురువారం ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ పట్టణంలోని ఓల్డ్‌కాలనీ, కాపువాడ, సర్దార్‌బస్తీ, సంజీవయ్య కాలనీల్లో ప్రచార సభల్లో పాల్గొననున్నట్లు బీజేపీ నాయకులు వెల్లడించారు. మిగితా పార్టీల అభ్యర్థులు కూడా ముఖ్య నేతలతో ప్రచారం నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు.
ఇంటింటా ప్రచారం
వార్డు నం.14, 27 అభ్యర్థులు చిమ్మని రేణుక, జవజి కవితలకు మద్దతుగా ఎమ్మెల్సీ దండె విఠల్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో డ్రెయినేజీ, తాగునీటి సమస్యల పరిష్కారానికి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు 3, 4, 10, 12, 16, 26, 28 వార్డుల్లో పర్యటించారు. కేంద్ర నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమని, బీజేపీ అభ్యర్థులకు మద్దతు పలకాలని విన్నవించారు. యూఐడీఎఫ్ కింద రూ.18.70 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకువచ్చామని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాగునీటి వసతి కోసం కేంద్ర ప్రభుత్వ రూ.35 కోట్లు కేటాయించిందని తెలిపారు. 18, 28 వార్డుల్లో బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, మహిళల సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ వార్డు నం.29 లో ప్రచారం చేశారు.
సమయం తక్కువగా ఉండటంతో ప్రచారం పరుగులు పెడుతోంది. ఆయా వార్డుల్లో పర్యటిస్తూ కుల సంఘాలు, మహిళలు, యువత మద్దతుతో గంపగుత్తగా ఓట్లు తెచ్చుకునేందుకు యత్నిస్తున్నారు. ముఖ్యంగా తటస్తులను తమవైపు తిప్పుకోవడంపై దృష్టి సారించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు సోషల్ మీడియా, వాట్సాప్‌ను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ వార్డులో అభ్యర్థి సొంత ఖర్చుతో అభివృద్ధి పనులు చేపట్టి ఓటర్ల మద్దతు పొందుతున్నారు. అధికార పార్టీకి దీటుగా బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నీ తానై ప్రచారం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో పాగా వేసేందుకు బీజేపీ వన్ ఎలక్షన్, వన్ నేషన్ జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు పావులు కదుపుతున్నారు.
ప్రచారం.. పరుగు


