బోధన సాగాలి.. భవిష్యత్ మెరవాలి
ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఎట్టకేలకు తరగతులు ప్రారంభం
24 మందికి ఐదుగురే బోధన సిబ్బంది
వేధింపుల ఆరోపణలతో ఇటీవల ప్రిన్సిపాల్ సస్పెన్షన్
ఆసిఫాబాద్‌రూరల్: ఉన్నత చదువులు చదివి రోగులకు సేవలందించాలని నర్సింగ్ కోర్సులో చేరిన విద్యార్థినులు పడరాని పాట్లు పడుతున్నారు. గతేడాది డిసెంబర్‌లోనే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా.. పలు ఘటనల అనంతరం బుధవారం నుంచి మొదలయ్యాయి. మరోవైపు వ్యక్తిగత పనులు చేయించుకోవడం, వేధింపుల ఆరోపణలతో ప్రిన్సిపాల్‌ను ఈ నెల 1న కలెక్టర్ సస్పెండ్ చేయడం కలకలం రేపింది.
వైద్యారంగాన్ని మరింత మెరుగుపర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో వైద్యకళాశాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే జిల్లాకు వైద్యకళాశాలతో పాటు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల మంజూరైంది. 2024 డిసెంబర్ 2న జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్‌లో నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు. ఈ క్రమంలో 2025– 26 విద్యాసంవత్సరంలో బీఎస్సీ నర్సింగ్(నాలుగేళ్ల కోర్సు)లో 60 సీట్లకు 58 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. ప్రస్తుతం సెకండియర్ విద్యార్థినులు 39 మంది ఉన్నారు.
ప్రిన్సిపాల్‌పై వేధింపుల ఆరోపణలు
బైపీసీ పూర్తిచేసిన వివిధ ప్రాంతాలకు చెందిన వి ద్యార్థులు బీఎస్సీ నర్సింగ్‌లో చేరారు. అయితే బాలి కలతో ప్రిన్సిపాల్ వ్యక్తిగత పనులు చేయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహించాల్సి ఉండగా, ఎలాంటి టైం టేబుల్ పాటించలేదని తెలుస్తోంది. బట్టలు ఉతికించడం, గదులు, మరుగుదొడ్లు శుభ్రం చేయించడం, వీధి కుక్క పిల్లలకు పాలు తాగించడం వంటి పనులు చేయించేవారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఓ విద్యార్థినిని కుక్క కాటు వేయడంతో భయంతో ఇంటికి వెళ్లినట్లు చెబుతున్నారు. బోధన సిబ్బందికి సైతం ఇతర పనులు అప్పగించారని తెలుస్తోంది. గత డిసెంబర్ నుంచి తరగతులు ప్రారంభం కా వాల్సి ఉంది. కానీ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే కనీసం బోధన కొనసాగలేదని సమాచారం. కలెక్టర్ దృష్టికి చేరడంతో ఈ నెల 1న కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేధింపుల విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు.
విద్యార్థినులకు ఇబ్బందులు రానీయొద్దు
ఆసిఫాబాద్‌రూరల్: నర్సింగ్ విద్యార్థినులకు ఇబ్బందులు రానీయొద్దని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను బుధవారం తనిఖీ చేశారు. హాస్టల్ వసతి, తరగతి గదులు, మరుగుదొడ్లు, మెస్‌పాటు బోధన, హాజరు శాతం తదితర వివరాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సక్రమంగా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్రమశిక్షణతో చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థినులకు సూచించారు. కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రేమ్‌కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.
బోధన సిబ్బంది కొరత
ప్రస్తుతం మొదటి సంవత్సరంలో 60 మందికి 58 మంది, ద్వితీయ సంవత్సరంలో 60 మంది 39 మంది మొత్తం 97 మంది విద్యార్థినులు ఉన్నారు. 24 బోధన సిబ్బంది ఉండాల్సి ఉండగా, కేవలం ఐదుగురితో నెట్టుకువస్తున్నారు. 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కళాశాలలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అసోసియెట్ ప్రొఫెసర్, బోధన సిబ్బంది 21 మంది ఉండాలి. ఇదే వసతి గృహంలో ప్రభుత్వ వైద్యకళాశాలకు చెందిన 50 విద్యార్థినులకు సైతం వసతి కల్పించారు. వారందరికీ సరిపడా మరుగుదొడ్లు, గదులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తరగతులు సక్రమంగా నిర్వహిస్తాం
విద్యార్థినులకు ఇబ్బందులు లేకుండా సక్రమంగా తరగతులు నిర్వహిస్తాం. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన బోధన తరగతులను బుధవారం నుంచి ప్రారంభించాం. విద్యార్థినులకు అన్ని సౌకర్యాలతో కూడిన బోధన అందిస్తాం.
– ప్రేమ్‌దాస్, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్,
ప్రభుత్వ నర్సింగ్ కళాశాల


