చిత్తడి నేలగా ‘బొక్కివాగు’
వలస పక్షుల సంరక్షణ కేంద్రంగా చెరువు అభివృద్ధికి రెవెన్యూ, అటవీ, ఇరిగేషన్ శాఖల కార్యాచరణ పంచాయతీ పాలకవర్గ తీర్మానం
పెంచికల్‌పేట్: పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు, పర్యాటక అభివృద్ధి, పక్షుల సంరక్షణకు ప్రభుత్వం చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 152 చెరువులు ఉండగా పెంచికల్‌పేట్ మండలంలోని ఎల్లూర్ బొక్కివాగు ప్రాజెక్టు(చెరువు)ను అధికారులు చిత్తడి నేలగా గుర్తించారు. ఇరిగేషన్, అటవీ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధికి సంయుక్త కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల సర్పంచ్ చప్పిడే రవి ఆధ్వర్యంలో పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసి ఉన్నతాధికారులకు నివేదించారు.
వలస పక్షులకు ఆవాసం
ఎల్లూర్ గ్రామ సమీపంలో బొక్కివాగుపై 2012లో 2,500 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు 132 ఎకరాల్లో 2.6196 ఎంసీయూబీ సామర్థ్యంతో చెరువు నిర్మించారు. ఎల్కపల్లి, పెంచికల్‌పేట్ గ్రామాలకు చెందిన రైతులు చెరువు నీటితో వర్షాకాలం, యాసంగిలో పంటలు సాగు చేస్తున్నారు. మరోవైపు చెరువులో ఏడాదంతా నీటి లభ్యత ఉండటంతో శీతాకాలంలో అరుదైన విదేశీ పక్షులు వలస వస్తున్నాయి. చెరువును ఆవాసంగా మార్చుకుంటున్నాయి. తమ సంతతిని వృద్ధి చేసుకుని వేసవి ప్రారంభంలో తిరిగి సొంత ప్రదేశాలకు తరలివెళ్తున్నాయి. గడిచిన నాలుగేళ్లుగా పెంచికల్‌పేట్ రేంజ్‌లో అధికారులు ప్రత్యేకంగా బర్డ్ వాక్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అరుదైన పక్షి జాతులను గుర్తిస్తున్నారు. చెరువును చిత్తడి నేలగా గుర్తించడంతోపాటు పక్షుల సంరక్షణ కేంద్రంగా అధికారులు గుర్తించాలని నిర్ణయించిన నేపథ్యంలో పక్షి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆక్రమణలకు అడ్డుకట్ట..
వేసవిలో చెరువులో నీటి సామర్థ్యం తగ్గిన సమయంలో కొంత మంది శిఖం భూములను సాగు చేస్తూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. మరో అరుదైన పక్షి జాతులు సంచరిస్తున్న నేపథ్యంలో పలువురు పక్షులను వేటాడుతున్నారు. ప్రభుత్వం చిత్తడి నేలగా గుర్తించిన నేపథ్యంలో ఆక్రమణలకు అడ్డుకట్ట పడి అరుదైన పక్షులకు సంరక్షణ కేంద్రంగా మారనుంది.
చెరువు సంరక్షణకు చర్యలు
రైతులకు సాగు నీటిని అందించాలనే సంకల్పంలో ప్రభుత్వం బొక్కివాగు చెరువును నిర్మించింది. చెరువు నిర్మాణానికి రైతుల నుంచి 132 ఎకరాల భూమి సేకరించాం. హద్దులు ఏర్పాటు చేసి చిత్తడి నేలగా గుర్తింపు ప్రక్రియలో సహకారం అందిస్తాం.
– డి.తిరుపతి, తహసీల్దార్, పెంచికల్‌పేట్
పక్షుల సంరక్షణ కేంద్రంగా..
పెంచికల్‌పేట్ రేంజ్ పరిధిలో అరుదైన విదేశీ పక్షులు ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. బొక్కివాగు చెరువులో అనేక పక్షులు తమ సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయి. చిత్తడి నేలగా గుర్తించడంతోపాటు అరుదైన పక్షుల సంరక్షణ కేంద్రంగా చెరువు మారనుంది.
– అనిల్‌కుమార్, ఎఫ్‌ఆర్‌వో, పెంచికల్‌పేట్
అభివృద్ధికి అంచనాలు
బొక్కివాగు ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి అంచనాలు తయారు చేస్తున్నాం. ఇటీవల రెవెన్యూ, అటవీ, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పంచాయతీ పాలకవర్గంతో సమావేశం నిర్వహించాం. గ్రామస్తుల సహకారంతో పర్యాటక ప్రాంతంగా రూపొందించడానికి నివేదికలు తయారు చేసి అధికారులకు అందిస్తాం.
– ప్రభాకర్‌రావు, ఇరిగేషన్ ఈఈ
చెరువులో బ్లాక్ హెడెడ్ ఐబిస్ పక్షులు
చిత్తడి నేలగా ‘బొక్కివాగు’


