రోగులతో మర్యాదగా మెలగాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రులకు ఎక్కువగా సామాన్యులు, ఆదివాసీ గిరిజనులు వస్తుంటా రని, వైద్యసిబ్బంది వారితో మర్యాదగా మెలగాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలోని వార్డులు, విభాగాలను పరిశీలించి, రోగులను అడిగి వైద్యసేవలపై ఆరా తీశారు. రక్త నిల్వల గదిని పరిశీలించి వైద్యులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. వార్డులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. రోగులకు నాణ్యమైన భోజనం, శుద్ధమైన తాగునీటిని అందించాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి పర్యవేక్షకుడు ప్రవీణ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సుభోద్‌కుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


