కాగజ్‌నగర్‌లో ఇదీ పరిస్థితి..
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లోని 30 వార్డుల్లో 170 మంది నామినేషన్లు వేయగా సోమవారం నలుగురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వార్డు నం.7లో రవళిక అడ్లూరి(కాంగ్రెస్), వార్డు 14లో ఫారుక్ ఉన్నీసా బేగం(బీఎస్పీ), వారు 18లో లింగంపల్లి లక్ష్మి సాయిప్రసన్న(బీఆర్‌ఎస్), వార్డు 29లో దిండు సునీల్‌గౌడ్(బీఆర్‌ఎస్) తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని మున్సిపల్ కమిషనర్ తిరుపతి తెలిపారు.
ఉపసంహరణకు వెనుకడుగు
కాగజ్‌నగర్‌లో బీజేపీ నుంచి 48, బీఆర్‌ఎస్ 73, బీఎస్పీ 19, కాంగ్రెస్ 56, జనసేన 4, ఏఐఎంఐఎం 4, సీపీఎం2, ఐయూఎంఎల్ 3, ఐపీబీపీ 1, ఇండిపెండెంట్లు 20 మంది నామినేషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన పార్టీల్లో తీవ్రమైన పోటీ ఉండడంతో నామినేషన్ల ఉపంసహరించుకునేందుకు అభ్యర్థులు ససేమిరా అంటున్నారు. బీఫామ్ తర్వాత ఇస్తాం. ఆసక్తి గలవారు ముందుగా పార్టీ పేరిట నామినేషన్లు వేయాలని చెప్పడంతో ఆశావహులు పోటీకి సిద్ధమయ్యారు. ఇప్పుడు బీఫామ్ ఇవ్వకుంటే తప్పుకుంటారా? ఇండిపెండెంట్లుగా బరిలో నిలుస్తారా అనేది మంగళవారం సాయంత్రం తేలనుంది. ఆ తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించి గుర్తులు ప్రకటిస్తారు. ప్రధాన పార్టీలు సర్వేల్లో విజయావకాశాల ఆధారంగా టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి. అవసరమైన చోట అభ్యర్థులను సైతం మార్చుతున్నారు. తొలుత అనుకున్నవారు ప్రచారం చేస్తుండగానే.. ఫోన్ చేసి టికెట్ ఇవ్వడం లేదని సర్దిచెబుతున్నారు. ఇలాంటి వారిని బీఫామ్ ఇచ్చేముందే పోటీ నుంచి తప్పుకోవాలని కోరే అవకాశం ఉంది.


