‘బెల్టు’ జోరు.. నాణ్యత బేజారు
చింతలమానెపల్లి: జిల్లాలో బెల్టు షాపుల జోరు కొనసాగుతోంది. అయితే ఇటీవల ఆయా దుకాణాల్లో మద్యం నాణ్యతపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీసాల తీరు, వాసన అనుమానాస్పదంగా ఉంటోందని మందుబాబులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు మద్యం విక్రయాల పరంగా ఒక ప్రత్యేకత ఉంది. తక్కువ జనాభా ఉన్నా మద్యం విక్రయాల్లో ఇతర జిల్లాలతో పోటీ పడుతోంది. ఆసిఫాబాద్ డివిజన్‌లో 16, కాగజ్‌నగర్ డివిజన్‌లో 16 లైసెన్స్‌డ్ మద్యం దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా అదనంగా మున్సిపాలిటీల్లో బార్ అండ్ రెస్టారెంట్లు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది నూతన దుకాణాలు ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు రూ.11.20 కోట్లకు పైగా విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.
అడ్డూఅదుపు లేకుండా నిర్వహణ
జిల్లావ్యాప్తంగా లైసెన్స్‌డ్ దుకాణాలు ఉండగానే.. ప్రతీ గ్రామంలోనూ బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. జనాభాను అనుసరించి ఒక్కో గ్రామంలో 20కి పైగా ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ లేకపోవడంతో కొన్నిచోట్ల దేశీదారు, నాటుసారా సైతం విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితి కల్తీ మద్యం విక్రయదారులకు వరంలా మారింది. కొందరు కల్తీ మద్యాన్ని నేరుగా బెల్టు షాపులకే సరఫరా చేస్తున్నారు. చింతలమానెపల్లి మండల కేంద్రంతోపాటు రవీంద్రనగర్, గూడెం గ్రామాల్లో మద్యం దుకాణాలు ఉన్నాయి. పక్క మండలాలైన కౌటాల, బెజ్జూర్, కాగజ్‌నర్ నుంచి ఇక్కడికి మద్యం సరఫరా చేస్తున్నారు. అమ్మకాలు పెంచే క్రమంలో ఎక్సైజ్, పోలీసు శాఖలు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి వ్యాపారులు నేరుగా బెల్టు దుకాణాలకు కల్తీ మద్యం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు మద్యం కన్నా కల్తీ మద్యాన్ని తక్కువ ధరకు అమ్ముతున్నారు. బెల్టు దుకాణాల నిర్వాహకులు సైతం కల్తీని గుర్తించలేకపోతున్నారు.
సరిహద్దు మండలాల గుండా..
చింతలమానెపల్లి, కౌటాల, సిర్పూర్(టి), బెజ్జూర్, దహెగాం మండలాలు జిల్లా సరిహద్దుగా ఉన్నాయి. మహారాష్ట్రలో లిక్కర్ ధరలు తెలంగాణతో పోలిస్తే ఎక్కువ. రూ.వెయ్యి పలికే ఫుల్‌బాటిల్ మహారాష్ట్ర సుమారుగా రూ.200 ఎక్కువగా ఉంటుంది. రూ.2వేల ధరలో లభించే బాటిల్ మరో రూ.300 ఎక్కువగా ఉంటోంది. మరోవైపు గడ్చిరోలి జిల్లాలో మద్య నిషేధం అమలులో ఉంది. దీంతో ఈ మండలాల నుంచి కల్తీ మద్యం తరలించడం ఆదాయ వనరుగా మారింది. బెల్టు దుకాణాలతోపాటు మహారాష్ట్రకు కల్తీ మద్యం తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎకై ్సజ్ అధికారులు నిఘా పెడుతున్నామని చెబుతున్నా.. అసలు మద్యం మాటున కల్తీ సరఫరా అవుతోందని తెలుస్తోంది. పలువురు మద్యం వ్యాపారులపై గతంలో కేసులు కూడా నమోదయ్యాయి. కాగజ్‌నగర్ పట్టణంలో గతంలో భారీగా కల్తీ మద్యం సైతం పట్టుబడింది.
ఆరోగ్యంపై ప్రభావం
గ్రామీణ ప్రాంతాల్లో మద్యం నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసాలు, వాసన అనుమానాస్పదంగా ఉంటోంది. ఇలాంటి మద్యం తాగితే తీవ్రమైన అనర్థాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండె, కాలేయం, కిడ్నీ, మెదడు సంబంధిత జబ్బులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై కాగజ్‌నగర్ డివిజన్ ఎకై ్సజ్ సీఐ రవి కుమార్‌ను వివరణ కోరగా.. కల్తీ మద్యంపై నిఘా ఉంచామని తెలిపారు. అనుమానం వచ్చిన సందర్భంలో సంబంధిత మద్యం బాటిళ్లను తీసుకుని ఎకై ్సజ్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. నెలవారీగా మద్యం దుకాణాలలో తనిఖీలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.


