బాలికలను రక్షిద్దాం.. చదివిద్దాం
ఆసిఫాబాద్‌అర్బన్: బాలికలను రక్షించుకుందా మని, వారిని ఉన్నత చదువులు చదివించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేద్దామని కలెక్టర్ కె.హరిత పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవానికి అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాస్కర్‌తో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ధనిక దేశమైన అమెరికాలో కూడా ఇంతవరకు ఒక మహిళకు అధ్యక్ష పదవి లభించలేదని, కానీ భారతదేశంలోని మహిళలు రాష్ట్రపతి, గవర్నర్, సీఎంలుగా రాణిస్తున్నారని తెలిపారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి బహుమతులు ప్రదానం చేశారు. బాలికలు ప్రదర్శించిన సంప్రదాయ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఏవో వెంకటేశ్వర్లు, డీజీసీడీవో శకుంతల, మిషన్ భగీరథ ఈఈ సిద్దిక్, క్రీడల అధికారి శంబు, మహిళా సాధికారత సమన్వయకర్త శారద, సభ్యులు రాణి, మమత, సఖి సిబ్బంది, షీటీం సభ్యులు పాల్గొన్నారు.
లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు
ఆసిఫాబాద్: ప్రభుత్వ కార్యాలయాలు, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.హరిత తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం లైంగిక వేధింపుల నిరోధక చట్టం పాస్– 2013పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో వేధింపులకు గురైతే బాధితులు నిర్భయంగా హెల్ప్‌లైన్ నంబర్‌కు స మాచారం అందించాలని సూచించారు. కార్యాలయాలు, పని ప్రదేశాల్లో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాది అంజలి దేవి పాస్ చట్టం– 2013లోని సెక్షన్లను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.


