ఎన్నికలపై ప్రత్యేక నిఘా
ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడంపై పోలీసుశాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రెండు పట్టణాల్లో నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా లౌడ్‌స్పీకర్లు, మైక్‌సెట్లు వినియోగించడం, ర్యాలీల నిర్వహణపై దృష్టి సారించారు. సోషల్ మీడియాలో ప్రచారం, పోస్టులపై ఫోకస్ పెట్టారు. అలాగే పరిమితికి మించి నగదు, ఖరీదైన వస్తువుల తరలింపుపైనా ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు.
చెక్‌పోస్టులు ఇక్కడే..
ఆసిఫాబాద్ పరిధిలో రెండు, కాగజ్‌నగర్ పరిధిలో రెండు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ ఎక్స్‌రోడ్డు, రాజంపేట సమీపంలో అటవీశాఖ చెక్‌పోస్టు, భట్టుపల్లి ఎక్స్‌రోడ్డు, వినయ్‌గార్డెన్ సమీపంలో అగ్రికల్చర్ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. సంబంధిత అధికారుల లిఖితపూర్వక అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఇతర కార్యకలాపాలు నిర్వహించడం నిషేధించారు. రూ.50వేల కంటే ఎక్కువ నగదు, రూ.10వేల కంటే విలువైన వస్తువులు తరలించాలన్నా తప్పనిసరిగా ఆధారాలు చూపాల్సిందే. కాగా, ఎన్నికలు ముగిసే వరకు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు కొనసాగుతాయని, పోలీసు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహిస్తామని ఎస్పీ నితిక పంత్ తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కోరారు.


