చివరిరోజు పోటాపోటీ
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్‌టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు చివరిరోజు శుక్రవారం 110 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో కాంగ్రెస్ నుంచి 27, బీఆర్‌ఎస్ 23, బీజేపీ 17, బీఎస్‌పీ 03, సీపీఐ 03, సీపీఐఎం 01, స్వతంత్రులు 31, జనసేన నుంచి 05 నామినేషన్లు వచ్చాయని అధికారులు వెల్లడించారు. దీంతో ఆసిఫాబాద్ బల్దియాలో మొత్తం నామినేషన్ల సంఖ్య 160కి చేరింది. ఇక కాగజ్‌నగర్‌లో రాత్రి వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. మున్సిపల్ పరిధిలోని 30 వార్డులకు 131 మంది అభ్యర్థులు 176 నామినేషన్లును శుక్రవారం దాఖలు చేశారు. బీజేపీ నుంచి 48, కాంగ్రెస్ 56, బీఆర్‌ఎస్ 73, బీఎస్పీ 19, జనసేన 4, సీపీఐ(ఎం) 2, ఏఐఎంఐఎం 4, ఐయూఎంఎల్ 3, ఐపీబీపీ 1, ఇండిపెండెంట్ అభ్యర్థుల నుంచి 20 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 230కి చేరింది.
అభ్యర్థులకు నాయకుల మద్దతు
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున ఆయా వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌లు నామినేషన్ కేంద్రాల వద్దకు వచ్చారు. ఆఖరు రోజు కావడంతో అభ్యర్థులతోపాటు ఆయా కాలనీల నుంచి వచ్చిన ప్రజలు, నాయకులతో నామినేషన్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. కాగజ్‌నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం రోడ్డు రద్దీగా మారింది.
చివరిరోజు పోటాపోటీ


