రెండుసార్లు పనిచేశా
1967– 1972, 1980– 1984 మధ్య రెండుసార్లు కౌన్సిలర్‌గా కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేశా. ఆ సమయంలో మున్సిపల్ చైర్మన్‌లుగా మెతి చాంద్, జూపాక నర్సయ్యలు, కౌన్సిల్‌లో 20 మంది కౌన్సిలర్లు ఉండే. 1972 అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కాగజ్‌నగర్ ఎస్పీఎం గ్రౌండ్‌కు వస్తే వెండితో తులాభారం వేశారు. అప్పుడు కౌన్సిలర్లు నిబద్ధత, నిజాయతీతో పనిచేశారు. ఏపనైనా మాట ఇస్తే చేసేవాళ్లం. ప్రధాన కాలువకు అటు వైపు నుంచి మున్సిపల్ కాలనీలు ఉండేవి. మున్సిపల్ కార్యాలయం హనుమాన్ మందిర్ సమీపంలోని ఎస్పీఎం క్వార్టర్‌లో ఉండేది. పట్టణంలో అన్ని వార్డుల్లో దాదాపు మట్టి, బండలతో రోడ్లు, మురుగు కాలువలు ఉండేవి. ఇప్పుడు అన్ని వార్డుల్లో సిమెంటు రోడ్లు వచ్చినయ్. ఇందిరా మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు అక్కడ నివసిస్తున్న వారికి మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో నో లాస్, నో ప్రాపర్టీ కింద తీర్మానం చేసి ద్వారకానగర్, కౌసర్ నగర్ ఏరియాల్లోని ఓ రైతు వద్ద రూ.167కు కొనుగోలు చేశాం. అందరికీ ఇండ్ల స్థలాలు అందించాం. ఎన్నికల్లో మనిషిని చూసి మంచివాడు, మనవాడు, అందుబాటులో ఉంటాడు అని ఓటు వేసి గెలిపించేవారు. ఇప్పుడున్న పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పోటీ చేయడం డబ్బుతో కూడుకున్న పని. మనుషుల్లో స్నేహం, బంధాలు, ఆప్యాయతలు ఏమీ లేవు. ఆ జమానాలో రూ.200, రూ.500 ఖర్చు చేసి గెలుపొందాను.
– వనమాల రాములు(కౌన్సిలర్ రాములు), మాజీ కౌన్సిలర్


