ఆశలు తారుమారు..!
మహిళకే కాగజ్‌నగర్ మున్సిపల్ పీఠం
వార్డు స్థానాల్లోనూ సగం వారికే..
పలుచోట్ల ఆశావహులకు నిరాశ
కుటుంబ సభ్యులను బరిలోకి దించాలని యోచన
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మున్సిపల్ రిజర్వేషన్లు గతంలో పోలిస్తే పూర్తిగా మారాయి. బల్దియా పీఠం మహిళకు దక్కనుంది. ఇప్పటివరకు ఎనిమిదిసార్లు ఎన్నికలు జరగగా, గతంలో రెండుసార్లు అతివలు చైర్‌పర్సన్ పదవిని దక్కించుకున్నారు. ప్రస్తుతం రిజర్వేషన్ అనుకూలించడంతో వార్డు స్థానాల్లో సగానికి పైగా స్థానాలు, చైర్‌పర్సన్ స్థానం మహిళలను వరించనున్నాయి. పట్టణంలోని 1, 6, 7, 11, 12, 13, 20, 22, 23 వార్డుల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అయితే ఆశావహులకు స్థానాలు కలిసి రాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. కుటుంబ సభ్యులను బరిలోకి దించాలని యోచిస్తున్నారు.
రొటేషన్ పాటించడంతో..
కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా, ఇందులో 15 వార్డులు మహిళలకు, చైర్మన్ పీఠం బీసీ మహిళకు కేటాయించారు. రొటేషన్ విధానాన్ని పాటించడంతో 2020 ఎన్నికలతో పోలిస్తే రిజర్వేషన్లు పూర్తిగా మారాయి. 2020లో 1వ వార్డు జనరల్ ఉంటే ప్రస్తుతం బీసీ మహిళ, 3వ వార్డు జనరల్ ఉంటే బీసీ(మహిళ), 4వ వార్డు జనరల్(మహిళ) ఉంటే ప్రస్తుతం బీసీ మహిళ, 6వ వార్డు బీసీ జనరల్ నుంచి జనరల్ (మహిళ), 7వ వార్డు ఎస్సీ జనరల్ నుంచి జనరల్(మహిళ), 9వ వార్డు బీసీ జనరల్ నుంచి జనరల్(మహిళ), 12వ వార్డు ఎస్టీ జనరల్ నుంచి ఎస్సీ(మహిళ), 13వ వార్డు జనరల్(మహిళ) నుంచి బీసీ(మహిళ), 14వ వార్డు బీసీ మహిళ నుంచి జనరల్ (మహిళ)కు మారింది. దీంతో ఆశావహులు గందరగోళానికి గురయ్యారు. రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో వ్యూహాలు మారుస్తున్నారు. సొంత వార్డుల నుంచి కాకుండా సామాజిక వర్గానికి అనుకూలంగా ఉన్న పక్క వార్డుల వైపు దృష్టి సారిస్తున్నారు. మరికొందరు సొంత వార్డు వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. మహిళా రిజర్వేషన్ వచ్చిన చోట తమ కుటుంబ సభ్యుల(భార్య, తల్లి)ను బరిలో దింపే యోచనలో ఉన్నారు. పార్టీ మారినా సరే అనుకూలమైన వార్డు నుంచి పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆధిపత్యం చూపించిన వారికి ఈసారి నిరాశే ఎదురుకానుంది.
తొమ్మిదోసారి ఎన్నికలు
మున్సిపాలిటీలో ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగాయి. కేవలం రెండుసార్లు మాత్రమే మహిళలు చైర్‌పర్సన్ పీఠం దక్కించుకున్నారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో బీసీ మహిళ ఎన్నిక కానున్నారు. 2000లో బీసీ మహిళకు రిజర్వు కాగా కాంగ్రెస్ నుంచి కావేటి సాయిలీల విజయం సాధించారు. 2014లో జనరల్ మహిళకు కేటాయించడంతో అప్పటి టీఆర్‌ఎస్ పార్టీ నుంచి సీపీ విద్యావతి చైర్మన్‌గా ఎన్నికయ్యారు.


