ప్రమాదరహిత డిపోగా తీర్చిదిద్దాలి
ఆసిఫాబాద్: రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ ఆసిఫాబాద్ డిపోను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో ఎస్పీ నితిక పంత్, జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్, జిల్లా ఫైర్ అధికారి భీమయ్య, డీఎం రాజశేఖర్‌తో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల ని వారణ అందరి బాధ్యత అన్నారు. ఆర్టీసీని ప్రమాదరహిత ప్రయాణంగా రూపొందించడంలో డ్రైవర్ల పాత్ర ఎంతో ఉందన్నారు. డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యం వహించొద్దని, సెల్‌ఫోన్ మాట్లాడొద్దని సూ చించారు. ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే వందశాతం ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందన్నారు. జిల్లాలో 2024తో పోలిస్తే రోడ్డు ప్రమాదాల సంఖ్యలో పెద్దగా మార్పు లేదని పేర్కొన్నారు. అంతకు ముందు డిఫెన్స్ డ్రైవింగ్, వాహనాలు నడిపేటప్పుడు జరిగే అగ్ని ప్రమాదాల నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు, ప్రథమ చికిత్స వంటి అంశాలపై అగ్నిమాపక శాఖ, వైద్యాధికారులు ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. ఆర్టీసీ కార్మికులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సీతారాం, వైద్యుడు వినోద్‌కుమార్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.


