తేలిన వ్యాధిగ్రస్తుల లెక్క!
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కోసం డిసెంబర్ 18 నుంచి 31 వరకు నిర్వహించిన లెప్రసీ సర్వే ముగిసింది. సర్వేకు ఆశ కార్యకర్తలు దూరంగా ఉండటంతో కార్యక్రమం నామమాత్రంగా సాగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏటా జిల్లాలో వ్యాధి విజృంభిస్తుండగా, సర్వేలో కేవలం 18 మందికి మాత్రమే వ్యాధి నిర్ధారణ కావడం అనుమానాలకు తావిస్తోంది.
కుష్ఠు నిర్మూలనే లక్ష్యం
కుష్ఠును సమూలంగా నిర్మూలించి, వ్యాధి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా డిసెంబర్ 18వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వేను వైద్యారోగ్య శాఖ చేపట్టింది. కేంద్ర ప్రభు త్వ ఆధ్వర్యంలో ఇందుకోసం కార్యాచరణ రూపొందించారు. జిల్లా అధికారులు ఎల్‌సీడీసీ(లెప్రసీ కేస్ డిటెక్టీవ్ క్యాంపెయిన్) నిర్వహించారు. ఏటా ఆశ వర్కర్లు సర్వే చేపట్టేవారు. అయితే వారికి గతంలో చేపట్టిన సర్వే డబ్బులు అందకపోవడంతో ఈసారి దూరంగా ఉన్నారు. దీంతో జిల్లాలోని పీహెచ్‌సీల హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు బాధితుల వివరాలు సేకరించారు.
200 మంది అనుమానితులు
జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు అర్బన్ ఆరోగ్య కేంద్రాల పరిధిలో సర్వే చేపట్టారు. హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు సర్వేలో పాల్గొని రో జువారీ నివేదికలు రూపొందించారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు సర్వే చేయగా.. ఆ యా బృందాల పరిధిలో ఒక్కో టీం ప్రతీ రోజు 25 ఇళ్లను సందర్శించింది. ఇంటింటా నిర్వహించిన స ర్వేలో 200 మంది అనుమానితులను గుర్తించారు. ఇందులో 18 మందికి కుష్ఠు వ్యాధి నిర్ధారణ అ య్యింది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 108 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఉచితంగా వైద్యం
కుష్ఠు బాధితులకు వైద్య పరీక్షల అనంతరం ఉచితంగా మందులు అందిస్తాం. శరీరంపై తెల్లని స్పర్శ లేని, పాలిపోయిన మచ్చలు ఉంటే స్థానిక ఆస్పత్రుల్లో వైద్యులను సంప్రదించాలి. మొద్దుబారిన మచ్చలు, చేతివేళ్లు వంగడం, మచ్చలపై వెంట్రుకలు ఊడిపోవడం, చెమట రాకపోవడం, పాదాల్లో పుండ్లు తదితర లక్షణాలు కనిపిస్తే అనుమానితులుగా గుర్తిస్తారు. శరీరంపై ఐదు కంటే ఎక్కువగా మచ్చలు ఉంటే ఆరు నెలలపాటు, అంతకన్నా అధికంగా ఉంటే 12 నెలలపాటు ఉచితంగా వైద్యం అందిస్తాం.
– డాక్టర్ వినయ్ ఉప్రె,
లెప్రసీ ఇన్‌చార్జి ప్రోగ్రాం అధికారి
తేలిన వ్యాధిగ్రస్తుల లెక్క!


