
వీడని వాన
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, నదులు ప్రాజెక్టులకు భారీగా ఇన్‌ఫ్లో జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌రూరల్/సిర్పూర్(టి)/కౌటాల: జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాన పడటంతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. ప్రాజెక్టుల్లోకి భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. జిల్లాలో 62.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా వాంకిడిలో 94.3, జంబుగ 67, రెబ్బెన 62, ధనోరా 61.3, కెరమెరి 57.5, సిర్పూర్– టి 39.5, సిర్పూర్– యూ 38, జైనూర్ 36.0, గిన్నెధరి 33.0, వంకులం 31.5, కాగజ్‌నగర్ 27.5, ఆసిఫాబాద్ 25.8, లింగాపూర్ 23.0, బెజ్జూర్ 21.0, లోనవెల్లి 20.8, దహగాం 10.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
మున్సిపల్ సిబ్బందికి రెయిన్ కోట్లు
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని మున్సి పల్ రెస్క్యూ టీం కార్మికులకు మున్సిపల్ కమిషనర్ గజానంద్ రెయిన్‌కోట్లు పంపిణీ చేశారు. కమిషనర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచన మేరకు రానున్న రెండు రోజులపాటు జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున పట్టణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 96664 68821, 97057 80116, 73862 82002 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఉప్పొంగిన ‘పెన్‌గంగ’
మహారాష్ట్రలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో సిర్పూర్(టి) మండలం మీదుగా ప్రవహిస్తున్న పెన్‌గంగ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పరీవాహక ప్రాంతాల్లోని మాకిడి, జక్కాపూర్, హుడ్కిలి, వెంకట్రావ్‌పేట్, టోంకిని, పారిగాం, లోనవెల్లి తదితర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సిర్పూర్(టి)– మాకిడి అంతర్రాష్ట్ర రహదారిలోని హుడ్కిలి సమీపంలోని లోలెవల్ వంతెన పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. సిర్పూర్(టి) నుంచి మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. తహసీల్దార్ రహీముద్దీన్, డీఎల్‌పీవో ఉమర్ హుస్సేన్, ఎంపీడీవో సత్యనారాయణ వరద ప్రవహాన్ని పరిశీలించారు. హుడ్కిలి వంతెన మీదుగా మహారాష్ట్రకు రాకపోకలు నిలిపివేశారు. వెంకట్రావ్‌పేట్ సమీపంలోని వెంకట్రావ్‌పేట్– పోడ్సా అంతర్రాష్ట్ర రహదారిలోని వంతెన వద్ద నది ఉధృతిని పరిశీలించారు. సిర్పూర్(టి)– కౌటాల ప్రధాన రహదారిలోని పారిగాం సమీపంలో ఉన్న వాగు ఉప్పొంగడంతో రాకపోకలపై ఆరా తీశారు.

వీడని వాన

వీడని వాన