
గృహయోగానికి ‘అటవీ’ అడ్డంకి
మేడిపల్లి పంచాయతీలో నిలిచిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అటవీశాఖ పరిధిలో ఉందంటూ అధికారుల అభ్యంతరం ఆందోళన చెందుతున్న గిరిజనులు
సిర్పూర్(టి) మండలం మేడిపల్లికి చెందిన సుమన్‌బాయి భర్త పిల్లలతో కలిసి గుడిసెలో ఉంటుంది. కూలీ పనులు చేసుకుంటూ బతుకు వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో ఎంతో సంతోషపడ్డారు. అయితే అటవీశాఖ అధికారులు ఇంటి పనులు అడ్డుకున్నారు.
సిడాం లచ్చు ఏళ్లుగా మేడిపల్లిలో నివాసం ఉంటున్నాడు. అతడి భూములకు ప్రభుత్వం పట్టాలు కూడా మంజూరు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు పైలట్ గ్రామంగా ఎంపిక కావడంతో లచ్చుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అటవీశాఖ అభ్యంతరం తెలపడంతో ప్రస్తుతం నిర్మాణ పనులు ఆగిపోయాయి.
సిర్పూర్(టి): దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా బతుకుతున్న గిరిజనుల చెంతకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరడం లేదు. ఓ వైపు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, అటవీశాఖ అధికారులు మాత్రం అనుమతుల పేరిట అభ్యంతరం తెలుపుతున్నారు. ఫలితంగా ఏడు నెలులు గడిచినా ఆ పంచాయతీ పరిధిలో ఇప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. సిర్పూర్(టి) మండలం మేడిపల్లి గ్రామ పంచాయతీని అధికారులు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ ఏడాది జనవరి 26న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే చేతుల మీదుగా గ్రామస్తులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఎంతో ఆశతో ఇళ్లు నిర్మించుకునేందుకు సన్నద్ధమవుతుండగా అటవీశాఖ అధికారులు పనులు అడ్డుకుని నిలిపివేశారు.
దశాబ్దాలుగా నివాసం..
మేడిపల్లి పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అటవీశాఖ అనుమతులు లేకపోడంతోనే అర్ధంతరంగా నిలిచిపోయాయి. అటవీశాఖ అధికారులు నోటీసులు జారీ చేయడంతో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అటవీశాఖ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ఉమ్మడి సర్వే చేపట్టినా ఇప్పటికీ సర్వే రిపోర్టు రాలేదు. అయితే మేడిపల్లిలో దశాబ్దాలుగా గిరిజనులు నివాసం ఉంటున్నారు. భూములకు 50 ఏళ్ల నుంచి పట్టా పాసుపుస్తకాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సీసీరోడ్లు, మిషన్ భగీరథ ట్యాంక్, విద్యుత్ కనెక్షన్లు, పాఠశాల భవనాలు నిర్మించగా, ఇప్పుడు అధికారులు అటవీశాఖ పరిధిలో గ్రామం ఉందంటూ అడ్డు చెప్పడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టైగర్ కారిడార్ నేపథ్యమే కారణమా..?
మహారాష్ట్ర నుంచి కవ్వాల్ అభయారణ్యానికి పెద్దపులులు సంచరించే మార్గంలో సిర్పూర్(టి) రేంజ్ కీలకం. దీనిని అటవీశాఖ టైగర్ కారిడార్‌గా గుర్తించింది. పులుల రాకపోకలను నిత్యం ట్రాకింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేంజ్ పరిధిలోని అటవీ భూముల్లో తిరిగి ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం, పోడు సాగు అడ్డుకోవడంతోపాటు టైగర్ ట్రాకింగ్‌కు ప్రత్యేక ప్రణాళికలతో చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే చుట్టూ అటవీ ప్రాంతం ఉన్న మేడిపల్లి పంచాయతీ అటవీశాఖ తమ పరిధిలో ఉందంటూ ఇళ్ల నిర్మాణాలు నిలిపివేసిందనే చర్చ సాగుతోంది.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా..
పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక కావడంతో మేడిపల్లి పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాం. అయితే అడవి పరిధిలో గ్రామం ఉందంటూ అటవీశాఖ పనులు నిలిపివేసింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా. సబ్ కలెక్టర్ విచారణ చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
– సత్యనారాయణ, ఎంపీడీవో, సిర్పూర్(టి)
అనుమతులు రాలేదు
సిర్పూర్(టి) రేంజ్ పరిధిలోని మేడిపల్లి పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఇప్పటివరకు అటవీశాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాలేదు. పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు నివేదించాం. వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం.
– ప్రవీణ్‌కమార్, ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్‌వో
154 ఇళ్లు మంజూరు..
సిర్పూర్(టి) మండలం మేడిపల్లి పంచా యతీ పరిధిలోని మేడిపల్లి, రావన్‌పల్లి, లింబుగూడ గ్రామాలు ఉన్నాయి. ఈ మూడు గ్రామాలకు కలిపి మొత్తం 154 ఇళ్లను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద మంజూరు చేసింది. మేడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 750 మందికి పైగా జీవనం సాగిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న గ్రామస్తులకు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించారు. ఇళ్లు మంజూరై ఏడు నెలలు గడుస్తున్నా నేటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. రావన్‌పల్లి గ్రామంలో కేవలం ఏడు ఇళ్లు బేస్‌మెంట్ స్థాయి వరకు నిర్మించారు.

గృహయోగానికి ‘అటవీ’ అడ్డంకి

గృహయోగానికి ‘అటవీ’ అడ్డంకి