
నిండుకుండలా పీపీరావు ప్రాజెక్టు
దహెగాం: ఇరవై రోజుల క్రితం నీరు లేక వెలవెల బోయిన ప్రాజెక్టులు, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు చేరి కళకళలాడుతున్నాయి. మండలంలోని కల్వాడ సమీపంలో ఉన్న పీపీరావు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గత మంగళవారం, శనివారం భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులో నీరు నిండి మత్తడి పైనుంచి నీరు పారింది. దీంతో ఎర్రవాగు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహించింది. ఆదివారం ప్రాజెక్టు నీటి మట్టం 147.5 మీటర్లు కాగా పూర్తి నీటి మట్టానికి చేరుకుని మత్తడిపై నుంచి నీరు పారుతోంది. ఇన్‌ఫ్లో 750 క్యూసెక్కులు కాగా అవుట్‌ఫ్లో 750 క్యూసెక్కుల వరద ఎర్రవాగులోకి చేరుతుంది. దీంతో ఆయకట్టు సాగుకు ఢోకా లేదని రైతులు పేర్కొంటున్నారు.